AP Heatwave: మరో 3 రోజులు జాగ్రత్త.. ఏపీలో భానుడి ఉగ్రరూపం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
మరో రెండు, మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని, ఎండల తీవ్రత కొనసాగనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
AP Heatwave: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చెలరేగిపోతున్నాడు. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. హాట్ సమ్మర్ సెగలు పుట్టిస్తోంది. అటు రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు 48 డిగ్రీలు దాటేశాయి.
ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లా కంకిపాడులో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3 డిగ్రీలు.. ఏలూరు జిల్లా కుక్కునూరు, కూనవరం (పోలవరం) లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి, ప్రకాశం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు, మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని, ఎండల తీవ్రత కొనసాగనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: ఒకే రోజు 10 లక్షల కోళ్లు మృతి.. ఉన్నట్టుండి మెడ వేలాడేస్తున్న కోళ్లు.. ఏపీలో ఏం జరుగుతోంది?
