Andhra Pradesh Rains
Andhra Pradesh Rains : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉంది. మరో 24 గంటల్లో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 26న వాయుగుండంగా మారొచ్చని ఐఎండీ అంచనా వేసింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరొక మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వివాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గడిచిన 24గంటలుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. విశాఖ మధురవాడలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో చాలా జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
ఇక, తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వానలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.