Ys Jagan: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై జగన్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు
మండలిలో తమకు బలం ఉందని, ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారని, మాట్లాడేందుకు సమయం కూడా ఉంటుంది కాబట్టి..
Ys Jagan Representative Image (Image Credit To Original Source)
- శాసనసభకు హాజరుకాకూడదని జగన్ నిర్ణయం
- ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం
- ఎమ్మెల్సీలు శాసనమండలికి వెళ్లాలని జగన్ ఆదేశం
Ys Jagan: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రమే శాసన మండలికి హాజరవుతారని తెలిపారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, అందుకు నిరసనగా అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు తాము సభకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గతంలో జగన్ చెప్పారు. ఈసారి కూడా అదే రీజన్ వినిపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో తమకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం వస్తుందని, ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందన్నది వైసీపీ వాదన. ప్రజా సమస్యల గురించి చర్చించే అవకాశం లేకుండా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కావాలనే అసెంబ్లీ స్పీకర్, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు.
సభలో ప్రజల సమస్యల గురించి ఎక్కువ సేపు తాము చర్చించాలంటే కచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఉండాలని వైసీపీ తేల్చి చెబుతోంది. హోదా అనేది ఉంటేనే అది సాధ్యమవుతుందని జగన్ చెబుతున్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం మాత్రమే ఇస్తామంటే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరు మాట్లాడతారని జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా మరోసారి ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ సభ్యులు గళమెత్తారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కూడా తెలిపారు.
ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఆదేశాలు..
శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కావాలని జగన్ ఆదేశించారు. మండలిలో తమకు బలం ఉందని, ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారని, మాట్లాడేందుకు సమయం కూడా ఉంటుంది కాబట్టి.. మండలిలో ప్రజా సమస్యలపై గళం వినిపించాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు జగన్. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను మండలిలో లేవనెత్తాలన్నారు. ప్రధానంగా తిరుమల లడ్డూ వివాదం, రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు, విశాఖలో భూ కేటాయింపులు, ఇలా పలు అంశాలపై మండలిలో చర్చించాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. ప్రతి సభ్యుడు క్షుణ్ణంగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని, ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా సభ ముందు ఉంచాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు జగన్.
ప్రతిరోజూ ప్రెస్ మీట్లు..
అటు ఎమ్మెల్యేలకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు జగన్. ఎమ్మెల్యేలు సభకు వెళ్లడం లేదు కాబట్టి.. శాసనసభలో జరిగే ఇష్యూస్ పై ప్రతిరోజు బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ప్రతిరోజు అంశాల వారీగా సమావేశాలు పెట్టాలన్నారు. కీలక అంశాలు వచ్చినప్పుడు నేను కూడా మీడియా ముందుకు వస్తానని విషయాలని చెబుతానని ఎమ్మెల్యేలతో జగన్ అన్నారు.
