Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాక్.. మరో కేసులో రిమాండ్
జైల్లో వసతులు కల్పించాలంటూ మరో పిటిషన్ ను అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు.
Ambati Rambabu Representative Image (Image Credit To Original Source)
- సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్
- ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు
- సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని కేసు
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టు. సత్తెనపల్లి లక్కీ డ్రా వివాదం కేసులో అంబటికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దాంతో పోలీసులు అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మరోవైపు సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, అలాగే జైల్లో వసతులు కల్పించాలంటూ మరో పిటిషన్ ను అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు.
సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సచివాలయ వాలంటీర్ల ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
2023 సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలపై జనసేన నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కాకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 2023 జనవరి 16న సత్తెనపల్లి పీఎస్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. తాజాగా ఆ కేసులో పీటీ వారెంట్ జారీ అయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. కొన్ని రోజులకు ఆయనపై మరో కేసు నమోదైంది. 2025 నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ రెండు కేసుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ తాజాగా సంక్రాంతి లక్కీ డ్రా కేసులో రిమాండ్ విధించడంతో ఇప్పట్లో అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
Also Read: చంద్రబాబు భేటీలు.. లోకేశ్ డిన్నర్ మీట్స్.. మ్యాటరేంటి?
