Site icon 10TV Telugu

ఏపీలో మహిళలకు బిగ్ అలర్ట్.. ఫ్రీ బస్ పథకంపై కీలక అప్డేట్.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు..

free bus scheme

free bus scheme

Apsrtc Free Bus Scheme Women: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా.. మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఆగస్టు 15న మంగళగిరిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: KCR Jagan: వైఎస్ జగన్, కేటీఆర్ ఇళ్లలో కనిపించని రాఖీ పండగ వాతావరణం.. అన్నలకు రాఖీ కట్టని కవిత, షర్మిల.. కారణం అదేనా..

ఏపీఎస్ఆర్టీసీ ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్సుప్రయాణం సౌకర్యాన్ని కల్పించనుంది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74శాతం వాటిలో ఈ పథకం వర్తిస్తుంది. సంస్థలో 11,449 బస్సులు ఉంటే.. ఉచిత ప్రయాణం అమలు చేసే ఐదు రకాల బస్సుల సంఖ్య 8,458గా ఉంది. వీటిలో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. దీంతో రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వం రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సులు ఇవే..
పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు (బస్సుల సంఖ్య 5,851), ఎక్స్‌ప్రెస్‌లు (1,610), సిటీ ఆర్డినరీ (710), సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ (287).
ఉచిత ప్రయాణం లేని దూర ప్రాంత బస్సులు ..
ఆల్ట్రా డీలక్స్ (బస్సుల సంఖ్య 643), సూపర్ లగ్జరీ (1,486), నాన్ ఏసీ స్లీపర్ స్టార్‌లైనర్ (59), ఏసీ బస్సులు (459), తిరుమల ఘాట్ బస్సులు (344).

♦ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు.
♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాల్లోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు.
♦ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదు.

 

ఆగస్టు 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు కానుంది. దీనివల్ల ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్ల కొరతను అధిగమించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి డిపోలో రోజువారీ ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్ల సంఖ్యనె పెంచుతున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని డిపోల్లో ఇతర విధులు (ఓడీ) నిర్వహిస్తున్న కండక్టర్ల విధులు రద్దు చేసి వారిని బస్సుల్లో డ్యూటీలకు పంపనున్నారు.

కొన్ని బస్టాండ్లలో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీచేసే గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల్లో ఉన్న కండక్టర్లను కూడా బస్సు డ్యూటీలకు కేటాయించనున్నారు. అవసరమైన చోట కొద్దిరోజులు డబుల్ డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు కండక్టర్లను కోరుతున్నట్లు తెలిసింది.

Exit mobile version