Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీకి బెయిల్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. విజయవాడ జైల్లో ఉన్నారు.
ఈరోజుతో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు వంశీని కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తాను శ్వాస కోశ, గొంతు సమస్యలతో బాధపడుతున్నట్లు వంశీ చెప్పడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని సత్యర్ధన్ ను బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారి, సెంట్రల్ ఏసీపీ దామోదర్ సోమవారం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Also Read: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి జగన్ రూ.25 లక్షల సాయం.. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ థ్యాంక్స్..
కాగా, వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస కోశ, గొంతు సమస్యలతో వంశీ ఇబ్బంది పడుతున్నారు. దీంతో వంశీని జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ విజ్ఞప్తి మేరకు జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. వంశీకి వైద్యులు వైద్య పరీక్షలు చేయనున్నారు.