విజయవాడలో మునిగిన లక్షలాది బైకులు, మెకానిక్ షాపులకు వాహనదారుల క్యూ..

మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు.

Vijayawada Floods : విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. నగరంలోని లక్షలాది బైకులు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో వాహనదారులు బైక్ మెకానిక్ షాపులకు క్యూ కడుతున్నారు. సర్వీసింగ్ కు వెయ్యి నుంచి 3వేల రూపాయలు.. ఇంజిన్ పాడైపోతే 10 నుంచి 15వేల రూపాయలు ఖర్చు అవుతోందని వాహనదారులు వాపోతున్నారు. మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు.

విజయవాడలో వచ్చిన వరదలు ప్రతి సామాన్యుడిని కూడా ఆర్థిక భారానికి గురి చేసింది. వరద కారణంగా లక్షల సంఖ్యలో మోటర్ బైక్స్ నీట మునిగాయి. అకస్మాత్తుగా వరద నీరు ముంచెత్తింది. దీంతో బైకులు నీట మునిగాయి. ఇప్పుడు వరద తగ్గడంతో వాహనదారులు బైకులను మెకానిక్ షెడ్లకు తీసుకొస్తున్నారు. ప్రతి మెకానిక్ షెడ్ దగ్గర వందల సంఖ్యలో బైకులు కనిపిస్తున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. రిపేరీ కోసం వాహనదారులు తమ బైకులను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నారు.

టూ వీలర్ అందరి జీవితంలో భాగమైపోయింది. అది లేకుండా ఇంటి నుంచి అడుగు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి. సామాను తెచ్చుకోవాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా, పనులు చేసుకోవాలన్నా టూ వీలర్ ఉండాల్సిందే. అలాంటి బైకులు పూర్తిగా నీటమునిగిపోవడంతో వాటికి రిపేర్లు చేసుకునేందుకు వాహనదారులు మెకానిక్ షెడ్ల వద్దకు తీసుకొస్తున్నారు. దీంతో మెకానిక్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వారు చాలా బిజీగా ఉన్నారు. వందల సంఖ్యలో వచ్చిన బైకులకు రిపేర్లు చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు.

బైక్.. వాటర్ లో మునిగిపోతే ఎలాంటి రిపేర్లు చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మెకానిక్ దగ్గరికి రావాలి..
* బైక్ నీటిలో మునిగితే వెంటనే స్టార్ట్ చెయ్యకుండా అలానే మెకానిక్ దగ్గరికి తీసుకురావాలి.
* ఎయిర్ ఫిల్టర్, కార్బొరేటర్, సైలెన్సర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
* స్టార్ట్ చేస్తే మాత్రం ఇంజిన్ చెడిపోయే అవకాశం ఉంటుంది.
* నార్మల్ క్లీనింగ్ కు వెయ్యి నుంచి 1500 మధ్యలో అవుతుంది.
* ఎలుకలు కొట్టేసి కాయిల్స్ పోతే ఎక్కువ ఖర్చు(5 నుంచి 6వేలు) అవుతుంది.
* బైక్ స్టార్ట్ చేసి ఇంజిన్ లాక్ అయితే తక్కువలో తక్కువ 10వేలు ఖర్చు అవుతుంది.

Also Read : ఇక కూల్చుడేనా? ఏపీలోనూ హైడ్రా తరహా సంస్థ తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్..!

ఇప్పటికే వరద నీటిలో ఇళ్లు మునిగిపోయి ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగిందని ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బైక్ రిపేరీలకు అయ్యే ఖర్చు భారంగా మారింది. ఇక కార్లు అయితే రిపేరీకి మరింత ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కార్లు కూడా పెద్ద సంఖ్యలో వరద నీటిలో మునిగాయి. ఇంజిన్ రిపేరీకి 30 నుంచి 40వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మెకానిక్ లు చెబుతున్నారు. మొత్తంగా విజయవాడలో ఉండే మెకానిక్ లకు అందరికీ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో వాహనదారులందరికీ ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 2వేల నుంచి 10-15వేల రూపాయల వరకు బైక్ రిపేరీకి ఖర్చు అవుతుందని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ గురించి చెబుతున్నా.. అప్పటివరకు ఆగే పరిస్థితి లేదంటున్నారు వాహనదారులు. బైక్ అన్నది లేకుండా తమ జీవనం సాగదని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బైక్స్ కు రిపేరీలు చేయించుకుంటామన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు