Botcha Satyanarayana
Botcha Satyanarayana : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్లే ఆగిందని బీఆర్ఎస్ అంటుంటంటే ప్రజలు నవ్వుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా వల్లే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని చిల్లర మాటలు ఎందుకు? అని ఆయన మండిపడ్డారు. మధ్యలో వచ్చి మా వల్లే ఆగింది అంటుంటే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ప్రకటనను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పటివరకూ బీఆర్ఎస్.. ఇప్పుడు మళ్లీ సెలబ్రిటీ పార్టీ. వీళ్లంతా ఎప్పుడు వచ్చారు. ఏం చేశారు. ఖాతాలో వేసుకోవడానికి. చిత్తశుద్ధితో మొదటి నుండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది మేమే అని మంత్రి బొత్స తేల్చి చెప్పారు.
”స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే ప్రతిపాదన రావడానికి వీలు లేదన్నారు మంత్రి బొత్స. మా వల్లే ప్రైవేటీకరణ ఆగింది. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మానుకోండి. కేంద్రాన్ని మీరేం నిలదీశారు? ఈ రెండు నెలల నుండి రాజకీయాలు కోసం మాట్లాడుతున్నారు. అంతకు ముందు ఏం చేశారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమం తెలంగాణలో ఎందుకు జరగడం లేదు?
అమరావతిలో పేదల భూములు విషయంలో మేము చెప్తున్నదే సుప్రీం ధృవీకరించింది. అమరావతిలో ఒకరే ఉండటానికి అదేమీ గేటెడ్ కమ్యూనిటీ కాదు. అన్ని వర్గాల ప్రజలు ఉండాలి. అభివృద్ధి చెందాలి. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వ్యక్తిగతం. అలాంటి మాటలు సమర్ధించం. మంత్రి హరీశ్ రావు బాధ్యతగా మాట్లాడాలి. నోరు జారితే సరి చేసుకోవాలి. చంద్రబాబు వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా కాపాడుకోవడం కష్టం. నమ్మకానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Also Read..Thota Chandrasekhar : ఏపీలో ఇది బీఆర్ఎస్ తొలి విజయం-తోట చంద్రశేఖర్
కాగా, ఏపీలో పార్టీలు చేయలేనిది కేసీఆర్ చేశారని, బీఆర్ఎస్ పోరాటం వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఇది ఏపీలో బీఆర్ఎస్ తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు కేంద్రం ప్రకటన హర్షనీయం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పరం చేయాలని భావించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదన్న ఆయన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని చెప్పారు.