Hindupuram Municipality
Hindupur Municipality: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో రాజకీయాలు హీటెక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు అధికార విపక్షాలు పావులు కదుపుతున్నాయి. అయితే, ప్రభుత్వం మారడంతో పరిస్థితులు కూడా మారాయి. 21మంది కౌన్సిలర్లను టీడీపీ నాయకులు క్యాంప్ కు తరలించారు. టీడీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు, ఎంఐఎం నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు. వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన 13 మంది కౌన్సిలర్లు మొత్తం 21 మందిని క్యాంపుకు తరలించారు.
Also Read: AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీ నుంచి గెలిచిన చైర్ పర్సన్ ఇంద్రజ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీన (సోమవారం) హిందూపురం మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక జరగనుంది. టీడీపీ కౌన్సిలర్ డీఈ రమేష్ ను ఏకగ్రీవంగా చైర్మన్ పదవికి ఎన్నుకునేందుకు ఈ క్యాంప్ రాజకీయాలని తెలుస్తుంది. రేపు జరగబోయే మున్సిపల్ సమావేశంకు ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి, 21 మంది కౌన్సిలర్లు హాజరు కానున్నారు.
ఇదిలాఉంటే.. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో 30 మంది కౌన్సిలర్లు వైసీపీ తరపున విజయం సాధించారు. ఆరుగురు టీడీపీ తరపున, ఒకరు బీజేపీ, ఒకరు ఎంఐఎం తరపును గెలుపొందారు. చైర్మన్ ఎన్నికకు కావాల్సింది 21 మంది కౌన్సిలర్లు. ఇప్పటికే వైసీపీ నుంచి 13మంది టీడీపీలో జాయిన్ అయ్యారు. వారితో కలుపుకొని టీడీపీ బలం 21కి చేరింది. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో కలిపి 23 మంది అవుతారు. దీంతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ టీడీపీ ఖాతాలో చేరిపోవటం ఖాయంగా కనిపిస్తుంది.