Jogi Ramesh
Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా మైలవరం సీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జోగి రమేష్‌తోపాటు మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన మరో ఏడుగురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్‌ఐ కె. సుధాకర్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నేపథ్యంలో కోమటి కోటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం విచారణ నిమిత్తం సీఐ కార్యాలయంకు పిలిపించారు. దీంతో అతడిని విడుదల చేయాలంటూ అక్కడకు చేరుకున్న జోగి రమేష్‌తోపాటు వైసీపీ నేతలు సీఐ కార్యాలయం ఎదుట సుమారు మూడు గంటలపాటు పోలీసులతో వాదనకు దిగి నిరసన తెలిపారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జోగి రమేశ్ తోపాటు మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన వైసీపీ నేతలు చామల సీతారామిరెడ్డి, మేడపాటి నాగిరెడ్డి, ఎర్రగుంట్ల సుకుంద్, గరికపాటి రాంబాబు, జడ రాంబాబు, నల్లమోతు మధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోమటి కోటేశ్వరరావుకు సోమవారం రాత్రి 41ఎ నోటీసు ఇచ్చి పంపామని, రెండు రోజుల తరువాత మరోసారి విచారణకు రావాల్సిందిగా తిరిగి నోటీసులు ఇచ్చామని ఎస్ఐ కె. సుధాకర్ తెలిపారు.
Also Read: Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీపై క్రిమినల్ కేసు నమోదు.. ఆమె భర్త మీదకూడా..