ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?
ఇప్పటివరకు దేవినేని అవినాశ్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. చెవిరెడ్డిని బెంగళూరులో... అవినాశ్‌ను హైదరాబాద్‌లో..

YCP Leader Roja
వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. ఈ రోజు ఒకరు.. రేపు ఇంకొకరు… నెక్ట్స్ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో..? వైసీపీ నేతలకు షాక్ మీద షాక్ ఇస్తోంది ప్రభుత్వం. అధికారంలో ఉండగా, టీడీపీ నేతలను వెంటాడినట్లు… ఇప్పుడు ప్రభుత్వం తమను వెంటాడుతుండటంతో ఏం చేయాలో తేల్చుకోలేక దిక్కులు చూస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.
కొందరు విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ చేస్తుంటే.. మరికొందరు సొంత నియోజకవర్గంలోనూ కనిపించకుండా తిరుగుతున్నారు. ఇప్పటివరకు వైసీపీలో కీలకంగా పనిచేసిన చాలా మందిపై కేసులు నమోదవగా, ఇప్పుడు మాజీ మంత్రులు రోజా, దర్మాన కృష్ణదాస్ వంతు వచ్చిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆడుదాం ఆంధ్రా స్కాంలో వీరిపై యాక్షన్ ఉంటుందనే ప్రచారం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది….
వరుస కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి… గన్నవరం కార్యాలయంలో దాడికి సంబంధించి వల్లభనేని వంశీ, గుడివాడలో స్థానికుల ఫిర్యాదుతో కొడాలి నాని, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వివిధ కేసులు నమోదు చేసిన ప్రభుత్వం.. తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై ఉచ్చు బిగించినట్లు సమాచారం.
ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతి?
ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతికి పాల్పడినట్లు ఈ ఇద్దరిపై విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో రోజా, ధర్మాన కూడా సర్కార్ రాడార్‌లోకి వచ్చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. గత ప్రభుత్వంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించాలని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రీడల నిర్వహణలో భాగంగా వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఈ ఆరోపణలు వెల్లువెత్తగా, ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. కానీ, అధికార, ప్రతిపక్షాల మధ్య ఆడుదాం ఆంధ్రా స్కాంపై మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఐతే, ఆడుదాం ఆంధ్రాపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, అప్పటి క్రీడా మంత్రిగా రోజా మాత్రం స్పందించలేదు. వాస్తవానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా… పొలిటికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించేశారు. తమిళనాడులో వివిధ పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు ఎక్కువ సమయం కేటాయించారు.
ఈ మధ్య విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇదేసమయంలో ప్రభుత్వం మాత్రం ఆడుదాం ఆంధ్రా పోటీల్లో అవినీతిపై తీగ లాగడం మొదలుపెట్టింది. ఇందులో రోజాకు భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పాత్ర కూడా ఉందని ఫిర్యాదుదారు ఆరోపించడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ప్రభుత్వం రోజాను టార్గెట్ చేయగా, ధర్మాన కృష్ణదాస్ పేరు అనూహ్యంగా వచ్చి చేరిందని టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రెచ్చిపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్, రోజా, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి టార్గెట్‌గా ఉచ్చుబిగించింది. చంద్రబాబు కుటుంబంపై ఇష్టానుసారం మాట్లాడటమే కాకుండా, వీరంతా హద్దుమీరి ప్రవర్తించారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇక ఇదే సమయంలో వీరి ప్రమేయం ఉన్న వివిధ కేసులు వెలుగుచూస్తున్నాయి.
గతంలో వీరంతా అధికారంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేసిన బాధితులు, కొత్త ప్రభుత్వంలో చర్యలు ఉంటాయనే భరోసాతో పోలీస్ స్టేషన్ తలుపు తడుతున్నారంటున్నారు. ఇక గతంలో చోటుచేసుకున్న టీడీపీ ఆఫీసులపై దాడులకు సంబంధించిన కేసులకు బూజు దులుపి చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో కొడాలి, వల్లభనేని వంటివారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మిగిలిన వారు గుట్టుచప్పుడుగా.. తమ ఆచూకీ తెలియకుండా తిరుగుతున్నారంటున్నారు. ఇక రోజాపైనా విచారణకు ప్రభుత్వం తాజాగా ఆదేశించడంతో…. ఈ ఫైర్‌బ్రాండ్ లీడర్ భవిష్యత్‌పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రోజాను అరెస్టు చేసే అవకాశాలు?
ఆడుదాం ఆంధ్రా పోటీల్లో రోజా ప్రమేయం ఉన్నట్లు పక్కా ఆధారాలతో ఫిర్యాదు అందినట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు. దీంతో రోజాను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి టీడీపీ రాడార్‌లోకి రోజా చేరడంతో… ఆమెపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అధికార, ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, రెండో కంటికి తెలియకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఇప్పటివరకు దేవినేని అవినాశ్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. చెవిరెడ్డిని బెంగళూరులో… అవినాశ్‌ను హైదరాబాద్‌లో అడ్డుకుని ఏపీకి పంపించారు అక్కడి పోలీసులు. ఇప్పటివరకు రోజాపై లుక్ అవుట్ నోటీసులు లేకపోవడంతో ఆమె గత నెలలో విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇక ఇప్పుడు సీఐడీకి అందిన ఫిర్యాదుతో రోజాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే… ఆమె కూడా దేశం దాటి వెళ్లే అవకాశాలు కోల్పోతారంటున్నారు. మొత్తానికి వైసీపీ నేతల టార్గెట్‌గా ప్రభుత్వం పకడ్బందీగా స్కెచ్ వేయడం…. రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.
Also Read: ఆసుపత్రులు శుభ్రంగా ఉండాలి.. రోగులు ఆసుపత్రికి రాగానే మంచి వాతావరణం కనిపించాలి: మంత్రి సత్యకుమార్