Cash Deposit in Bank Accounts : విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శివరామపురం గ్రామంలో వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో పలువురి బ్యాంకు ఖాతాల్లో ఉన్నపళంగా డబ్బు జమయింది. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతూనే సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామంలో 6వందలకు పైగా కుటుంబాలున్నాయి. సుమారు 2వందల మంది బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వచ్చి పడింది. ఒక్కొక్కరికి 13వేల 500 నుంచి 16 వేల వరకూ నగదు జమయింది.
అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చి పడిందనేది అంతు చిక్కట్లేదు. రైతు భరోసా నిధులు పడ్డాయనుకున్నారు. అయితే భూమి లేని వాళ్లకు కూడా డబ్బు పడింది. అమ్మఒడి పథకం కింద జమయ్యామో అని కొందరు భావించారు. అయితే ఇంటర్మీడియేట్ చదువుతున్న వాళ్లకు, పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోయిన ఆడబిడ్డలకు కూడా డబ్బు జమయింది. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.
అకౌంట్లలో డబ్బు ఎందుకు జమయిందో బ్యాంకు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే.. గ్రామంలో పలువురికి డబ్బు జమ కావడంతో అధికారులు రహస్య విచారణ జరుపుతున్నారని సమాచారం. అమరావతిలో ఆర్టీజీఎస్ తప్పిదం వల్లే డబ్బు జమ అయి ఉంటుందని భావిస్తున్నారు.