అంతర్వేదిపై జగన్ మాస్టర్ స్ట్రోక్

CBI Inquiry In Antarvedi Chariot Fire Incident: అంతర్వేది రథదగ్ధం విపక్షాలకు అస్త్రంగా తయారవుతునన్నవేళ జగన్ వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ముందు అంబటి వచ్చారు. అంతర్వేది ఘటనతో మతకల్లోలాలను రేపడానికి ప్రయత్నిస్తున్నారని, వాళ్లెవరైనా పట్టుకొంటామని వ్యాఖ్యానించారు. సిబిఐ ఎంక్వైరీకి కూడా రెడీ అన్నారు. అన్న గంటలోనే నిర్ణయం కాస్తా వెలువడింది. ఇంతత్వరగా జగన్ సిబిఐకి ఒప్పుకొంటారని విపక్షం ఊహించనేలేదు. ఇది జగన్ మాస్టర్ స్ట్రోక్.
నిజానికి ఇది రాజకీయంగా చాలా తెలివైన వ్యూహం. విపక్షానికి ఎలాంటి అవకాశం ఉండకూడదంటే నిర్ణయాలు స్పీడుగా ఉండాలి. అంతర్వేది ఘటన ఆధారంగా బీజేపీ, మిత్రపక్షం జనసేన, ఈ రెండింటికన్నా ఎక్కువగా తెలుగుదేశం జగన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
అంతర్వేదిలో రథం దగ్ధ శాంతిభద్రతల సమస్య కాదు. విశ్వాసాల మీద దాడి కాబట్టి ఇది ప్రమాదమా? లేక కుట్ర? అని తేల్చేయాల్సిందే. ఇక్కడే అధికారులు తొందరపడి ఇది పిచ్చి వాళ్ల పని అని చెప్పడంతో పరిస్థితి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారింది. అందుకే సమస్య ఎక్కడుందో జగన్ గుర్తించినట్లే కనిపించారు.
ఒకవేళ ఏపీ పోలీసులు విచారించినా ప్రజలను నమ్మించడం కష్టం. ప్రతిపక్షాలు రాజకీయంగా దాడులు చేస్తూనే ఉంటాయి. అందువల్ల సొంత విచారణను వదిలేసి, సీబీఐకి అప్పగించడం వల్ల జగన్ రెండు ప్రయోజనాలు సాధించారు. ఒకటి విచారణ బాధ్యతను కేంద్రం చేతిలో పెట్టారు. ఇక జగన్ సమాధానం చెప్పుకోవచ్చు.
రెండోది ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్ల ప్రభుత్వ విచారణ సంస్థల చేతికి విచారణ బాధ్యత అప్పగించారు. సిబిఐ హోం మంత్రి అమిత్ షా చేతిలో ఉంటుంది. అంటే… జగన్‌ని విమర్శించడానికి బీజేపీకి అస్త్రం లేదనే అనుకోవచ్చు.
టీడీపీ పరిస్థితి కూడా అంతే. సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతర్వేది ఘటన సవాళ్ల నుంచి సీబీఐకి అప్పగించి జగన్ బయటపడినట్లేనా? అంటే ప్రస్తుతానికి సమస్యను అధిగమించారు ఏపీ సిఎం.