Amaravati Capital
Amaravati Capital : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కేంద్రం మద్దతుతో అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా అమరావతి నిర్మాణంకోసం ప్రపంచ బ్యాంక్, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్లు రుణం తీసుకోనున్నారు. అదనపు రుణం పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రుణం కోసం రెండు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయనుంది.
Also Read: Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
మొత్తం 88వేల కోట్ల రూపాయలతో అమరావతిలో వివిధ పనులకు ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే 50వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. అమరావతిలో పలు ఇతర ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పివి ఏర్పాటు చేయనుంది. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి దరఖాస్తు చేయనుంది. ఈ రెండు బ్యాంకుల నుంచి అదనంగా రూ.14,200 కోట్లు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఏపీ రాజధాని నగర నిర్మాణం కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అని ఉండటంతో అవి అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతులందరికీ పట్టా పేరిట ప్లాట్లు ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో అవసరమైన మార్పులు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇటీవల జీవో జారీ చేశారు.