Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..

ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..

YSRCP MP Mithun Reddy

Updated On : September 18, 2025 / 7:24 PM IST

Midhun Reddy: ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది ప్రత్యేక దర్యాఫ్తు బృందం. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. కస్టడీకి ఓకే చెప్పింది.

అయితే, సిట్ 5 రోజుల కస్టడీకి కోరితే.. 2 రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో ఈ నెల 19, 20న రెండు రోజులు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరగనుంది. ఈ కేసులో మిథున్‌రెడ్డి పాత్ర, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ ప్రధానంగా దృష్టి సారించి ప్రశ్నించే అవకాశం ఉంది.

కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది సిట్. ఇప్పుడు మిథున్‌రెడ్డిని విచారించడం ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించవచ్చని భావిస్తోంది. కోర్టు ఆదేశాలతో నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు రోజుల విచారణలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అడిగే ప్రశ్నలపై ఆసక్తి నెలకొంది. సిట్ అధికారులు ఏయే ప్రశ్నలు సంధించనున్నారు? మిథున్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు.. 2 నిమిషాల్లో ఏం మాట్లాడాలి?- జగన్