Ys Jagan: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు.. 2 నిమిషాల్లో ఏం మాట్లాడాలి?- జగన్
అసెంబ్లీలో అధికారపక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందన్నారు. నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా.. అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Ys Jagan: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన లేదని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కొంత మంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది నాకు సలహాలు ఇచ్చారన్న జగన్.. కానీ మేము అలా చేయలేదన్నారు. వారి అభిప్రాయాలను విన్నామన్నారు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరూ గొంతు విప్పకూడదనేది కూటమి ప్రభుత్వం అభిప్రాయం అని ధ్వజమెత్తారు.
మొన్న ప్రెస్‌మీట్ లో సూపర్ సిక్స్-సూపర్ సెవెన్ మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడానని జగన్ గుర్తు చేశారు. ఈ మూడింటి గురించి ఆధారాలతో సహా మాట్లాడటానికి కనీసం గంటకుపైనే పట్టిందని, ఈ మాత్రం అవకాశం ఇస్తే… నిశితంగా సభలో చెప్పగలుగుతామన్నారు జగన్. లేదు, ఇవ్వం, రెండే రెండు నిమిషాలు ఇస్తామంటే.. ఇక మాట్లాడేది ఏముంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తానంటే.. ఇంకేం మాట్లాడగలం అన్నారు.
‘అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలే. అందులో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైసీపీ. అలాంటి రాజకీయ పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుంది.
అప్పుడు ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది.
కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అందుకే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మేం మాట్లాడుతున్నాం. కానీ, మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలిలో మనం ప్రజల తరఫున గొంతు విప్పడానికి అవకాశం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం” అని జగన్ అన్నారు.
మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు జగన్. ప్రభుత్వం ఉందా? లేదా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలనూ పట్టించుకోవడం లేదన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదని, అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని జగన్ అన్నారు.
ప్రతిచోట దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో అధికారపక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందన్నారు. నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా.. అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలాగూ వారు సమయం ఇవ్వరు కాబట్టి అసెంబ్లీ జరిగే సమయంలో ఆయా అంశాలపై మీడియా ద్వారా ప్రతి అంశంపైన మాట్లాడతారు. నేను కూడా సమ్ అప్ చేస్తూ మాట్లాడతాను అని జగన్ అన్నారు.
Also Read: ఎస్సీ, ఎస్టీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన