తిరుమలలో ఇటీవల జరిగిన తొక్కిసలాట అత్యంత దురదృష్టకరమైన ఘటన అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. మళ్లీ పునరావృతం కాకుండా తాము చూసుకుంటామని తెలిపారు.
సోషల్ మీడియాలో అసత్య వార్తలు నమ్మవద్దని బీఆర్ నాయుడు అన్నారు. తనపేరుపై తప్పుడు స్టేట్‌మెంట్స్ వస్తున్నాయని, ఇది బాధాకరమని తెలిపారు. పాలక మండలిలో వివాదాలు లేవని అన్నారు. తమమధ్య ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.
స్విమ్స్ ఆసుపత్రిలో ఆరుగురికి చెక్కులు ఇచ్చామని చెప్పారు. మిగిలిన వారికి వారి ప్రాంతాలకు వెళ్లి నిన్న చెక్కులు పంపిణీ చేశారని తెలిపారు. 31 మందికి చెక్కులు ఇచ్చారని, ఇంకా 20 మందికి ఇవాళ, రేపు అందజేస్తామని అన్నారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు.
టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. దీనిపై తాము స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతోందని, కానీ ఇక్కడ అన్నీ సమన్వయంతోనే జరుగుతున్నాయని తెలిపారు.
టీటీడీ చైర్మన్ తో తాను ఎప్పుడూ గౌరవంగానే మాట్లాడుతానని శ్యామలరావు అన్నారు. ఆయన కూడా తనతో చాలా గౌరవంగా మాట్లాడుతారని తెలిపారు. 6 నెలలుగా చేసిన మంచి పనులు పక్కన బెట్టి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.