Amaravati Land Acquisition : ఏపీ రాజధాని కోసం మ‌రో 44వేల ఎక‌రాలు.. ఈ గ్రామాల్లో భూసమీకరణకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు..

అమ‌రావ‌తి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్న‌ర్ రింగ్ రోడ్డుకు మ‌ధ్య‌లోని భూముల‌ను సేక‌రించ‌నుంది సీఆర్డీయే.

Amaravati Land Acquisition : ఏపీ రాజ‌ధాని కోసం మ‌రో 44వేల 676 ఎక‌రాల భూస‌మీక‌ర‌ణకు చంద్రబాబు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. తూళ్లూరు, అమ‌రావ‌తి, తాడికొండ‌, మంగ‌ళ‌గిరి మండ‌లాలోని గ్రామాల్లో భూస‌మీక‌ర‌ణ‌ చేయనుంది. తూళ్లూరు మండ‌లంలోని హ‌రిచంద్రాపురం, వ‌డ్డ‌మాను, పెద‌ప‌రిమి గ్రామాల్లోని 9వేల 919 ఎక‌రాలు.. అమ‌రావ‌తి మండ‌లంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కార్ల‌పూడి, మొత్త‌డాక‌, నిడ‌ముక్క‌ల గ్రామాల్లోని 12వేల 838 ఎక‌రాల్లో భూస‌మీక‌ర‌ణ‌ చేయనుంది.

తాడికొండ‌లోని తాడికొండ‌, కంతేరు గ్రామాల్లోని 16వేల 463 ఎకరాలను భూస‌మీక‌ర‌ణ ద్వారా సేక‌రించ‌నుంది సీఆర్డీయే. మంగ‌ళ‌గిరిలోని కాజా గ్రామంలోని 4వేల 492 ఎక‌రాల‌ను భూస‌మీక‌ర‌ణ ద్వారా సేక‌రించనుంది. రెండు మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది సీఆర్డీయే. ఇప్ప‌టికే రాజ‌ధానిలోని 29 గ్రామాల్లోని 34వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంది సీఆర్డీయే.

Also Read : రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ పై ఘాటు విమర్శలు..

అమ‌రావ‌తి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్న‌ర్ రింగ్ రోడ్డుకు మ‌ధ్య‌లోని భూముల‌ను సేక‌రించ‌నుంది సీఆర్డీయే. అమ‌రావ‌తికి ఎయిర్ పోర్ట్, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఔట‌ర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలెం నుండి అమ‌రావ‌తి వ‌ర‌కు కొత్త‌గా వేయ‌నున్న రైల్వే లైన్ కోసం ఈ భూములను వినియోగించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం.