AB Venkateswara Rao : రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ పై ఘాటు విమర్శలు..

జరిగిన తప్పులను సవరించుకుని, తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ..

AB Venkateswara Rao : రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ పై ఘాటు విమర్శలు..

Updated On : April 13, 2025 / 6:59 PM IST

AB Venkateswara Rao : రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. సమాజం కోసం పని చేసేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తన దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతులను అవగాహన చేసుకుని, జరిగిన తప్పులను సవరించుకుని, తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ, మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే నా ఉద్దేశంలో రాజకీయం అని ఆయన అన్నారు.

”రాజకీయాలంటే పదవులో, అధికారమో కాదన్నది నా ఉద్దేశం. నేను ఆరోజు చెప్పినట్లే బలహీనులు, బాధితులకు సాయం చేయడం కోసం, వారికి అండగా ఉండటం కోసం, అలాగే అన్యాయం జరిగితే ఎదురు నిలవడం కోసం, తప్పులు సరిదిద్దడానికే రాజకీయాల్లోకి వస్తున్నా.

నా ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి, ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్, ఆయన పార్టీ, ఆయన చేసే రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు కానీ, జగన్ రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నా. గత ఐదేళ్లలో జగన్, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసిన విధ్వంసాన్ని మనమందరం కళ్లారా చూశాం. ఆర్థిక విధ్వంసం చేశారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి కలగజేసినంత విధ్వంసం జరిగింది” అని ఏబీ వెంకటేశ్వరరావు జగన్ పై విరుచుకుపడ్డారు.

Also Read : అమరావతిలో మళ్లీ భూసమీకరణ.. రాజధాని కోసం మరో 30వేల ఎకరాలు..

”జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవస్థల విధ్వంసం జరిగింది. అలాగే ప్రజాస్వామ్యం విలువల విధ్వంసం జరిగింది. సామాజిక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాలన్నింటిని మనం కళ్లారా చూశాం. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాల పట్ల ఎన్నో దశాబ్దాలుగా మనం అలవరచుకున్న సభ్యత, సంప్రదాయాల పట్ల జగన్ కి, ఆయన పార్టీ వ్యక్తులకు ఎటువంటి గౌరవం లేదు. అటువంటి ప్రమాదం పునారవృతం కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం నా వంతుగా నేను పని చేస్తానని తెలియజేస్తున్నా.

ప్రజలంతా నిర్ణయించుకోవాల్సింది, నినదించుకోవాల్సింది ఒక్కటే ఉంది. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మాకొద్దు. నెవర్ ఎగైన్ అని మనమందరం ధృడ నిశ్చయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి ఐదేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయిన రాష్ట్రం, సమాజం ఇక మళ్లీ ఇలాంటి ఏమైనా జరిగితే.. పూర్తిగా అధ:పాతాళానికి పోతుందనే భయం రాష్ట్రంలో ఇవాళ చాలా మందిని వెంటాడుతోంది.

అందుకే రాష్ట్ర ప్రజలంతా ఏక కంఠంతో నినదించాల్సింది నెవర్ ఎగైన్. జగన్, ఆయన పార్టీ.. నేరాలు, హత్యలు, అవినీతి, అరాచాకం, అణిచివేత పునాదుల మీద నిర్మించబడింది. జగన్ దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే. జగన్ కు ప్రజల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి బాగోగుల గురించి ఏనాడు పట్టలేదు, ఏనాడూ పట్టదు కూడా.

Also Read : టీడీపీలో పదవుల జాతర మొదలైందా? మాకొక పదవి కావాలంటూ తెలుగు తమ్ముళ్ల ఆరాటం

యుక్త వయసు వచ్చాక మొదలెట్టి చేసిన పనులన్నీ అవే. రాజకీయాల్లో వచ్చాక చేసిన పనులు ఇవే. ఒక్క మాటల చెప్పాలంటే జగన్ ను ఒక మాన్‌స్టర్ అనొచ్చు. తనలాగే విపరీత మనస్తత్వం ఉన్న వాళ్లని, సభ్యత సంస్కారాలు లేని వాళ్లని తన పార్టీలో పెంచి పోషిస్తుంటారు జగన్. అటువంటి వాళ్లకే పెద్ద పీట వేస్తుంటారు. అటువంటి వాళ్లకే ప్రమోషన్లు కూడా ఇస్తుంటారు. ప్రతిపక్ష నేతల ఇళ్ల మీదకెళ్లి దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీ ఆఫీసులు పగలగొట్టడం, ఏ మాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం.. జగన్ దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఇవీ అర్హతలు” అని ఏబీ వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు.