టీడీపీలో పదవుల జాతర మొదలైందా? మాకొక పదవి కావాలంటూ తెలుగు తమ్ముళ్ల ఆరాటం

టీడీపీ గెలుపు కోసం చాలా మంది నేతలు కష్టపడ్డారు. అయితే వారందరికి న్యాయం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిన్నారంట.

టీడీపీలో పదవుల జాతర మొదలైందా? మాకొక పదవి కావాలంటూ తెలుగు తమ్ముళ్ల ఆరాటం

Updated On : April 13, 2025 / 3:30 PM IST

టీడీపీలో పదవుల జాతర మొదలైందా? బంపర్ మెజార్టీతో అధికారంలోకి కూటమి సర్కారులో పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారా? మాకొక పోస్ట్ ప్లీజ్ అంటూ అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారా? అంటే అవుననే సమాధానం పసుపు దండులో విన్పిస్తోంది. మే నెలాఖరులోగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధినేత ఆదేశించడంతో పసుపు దళంలో పదవుల కోలాహలం మొదలైంది.

ఏపీలో తిరుగులేని మెజార్టీతో గెలిచిన కూటమి సర్కారులో పదవుల జాతర మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు పదవులను కట్టబెట్టారు చంద్రబాబు.

ఇక మూడో విడత జాబితాలో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో.. 705 పదవులు భర్తీ చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటిస్తామని స్పష్టం చేసారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడిన నేతలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీలో పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీపడుతున్నారంట.

Also Read: పార్టీ అధిష్టానమే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా? సీఎం రేవంత్‌ ఏయే ఇబ్బందులు పడుతున్నారు?

మాకొక పదవి ప్లీజ్ అంటూ పార్టీ నేత, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారంట. పదవుల కోసం పార్టీ అధిష్టానానికి దాదాపు 60వేల అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. అటు జనసేన, బీజేపీలు కూడా మరిన్ని పోస్టులు అడుగుతున్నాయంట. దీంతో అందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ఎన్నికల షెడ్యూల్‌ సైతం ప్రకటన
ఒకవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ విడతలవారీగా సాగుతుండగా మరోవైపు పార్టీలోనూ పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. క్షేత్రస్థాయిలోని కుటుంబ సాధికార సారథులు మొదలు.. లోక్‌సభ నియోజకవర్గస్థాయి వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ప్రక్రియను వచ్చే నెల మే 15లోగా పూర్తి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్నికల షెడ్యూల్‌ సైతం ప్రకటించారు.

సంస్థాగత ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యమివ్వాలని కీలక సూచనలు కూడా చేశారట. టీడీపీ రికార్డు స్థాయిలో 1.02 కోట్లకుపైగా సభ్యత్వాల నమోదు ప్రక్రియను ఇటీవలే పూర్తి చేసింది. వచ్చే నెల 15లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, మే 28, 29, 30 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడులోగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో అత్యంత పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థ ఉంది. సగటున ప్రతి 60 మంది ఓటర్లకు ఒక మహిళ, ఒక పురుషుడు చొప్పున ఇద్దరు కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. బూత్, గ్రామ, క్లస్టర్, యూనిట్, మండల, పట్టణ, డివిజన్‌ కమిటీలు, అనుబంధ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, పార్లమెంటు కమిటీలు ఇలా..కొన్ని లక్షల సంస్థాగత పదవులకు టీడీపీ ఎన్నికలు నిర్వహించనుంది.

కుటుంబ సాధికార సారథుల కమిటీని ఏప్రిల్‌ 20లోపు పూర్తిచేయాల్సి ఉంది. బూత్, గ్రామ కమిటీల గడువు ఏప్రిల్‌ 14 నుంచి 22 వరకు ఉంది. క్లస్టర్, యూనిట్, మండల, పట్టణ, డివిజన్‌ కమిటీలు, అనుబంధ కమిటీలకు ఏప్రిల్‌ 23 నుంచి 30 వరకు గడువు ఉంది. శాసనసభ నియోజకవర్గ కమిటీలు, అనుబంధ కమిటీలను మే 1 నుంచి 7లోపు పూర్తి చేయాల్సి ఉండగా..లోక్‌సభ నియోజకవర్గ కమిటీలు, అనుబంధ కమిటీలను మే 8 నుంచి 15 వరకు ఎన్నుకోవాల్సి ఉంది.

టీడీపీ గెలుపు కోసం చాలా మంది నేతలు కష్టపడ్డారు. అయితే వారందరికి న్యాయం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిన్నారంట. కూటమి సర్దుబాట్లలో భాగంగా సీట్లు కోల్పోయిన సీనియర్ నేతలకు కూడా పదవులను కట్టబెట్టాల్సిన అవసరం ఉందన్న టాక్ విన్పిస్తోంది. పీఠాపురం వర్మ, రంగా, ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు, దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితుడు. వీరితోపాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడినవారు కూడా కీలకమైన నామినేటెడ్‌ పోస్టులు అడుగుతున్నారు. మరి అలాంటి నేతలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్న వాదన సైతం పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది.