Chandrababu Naidu
AP GO No.1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సహా ఆ పార్టీ నేతలు పలువురు స్పందించారు. జనవరి 2న ఏపీ సర్కారు జీవో నంబర్ 1ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ అనేక వ్యాజ్యాలు దాఖలు కాగా, ఆ జీవోను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసింది.
దీనిపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ… దేశంలో అంతిమంగా గెలిచేది, నిలిచేది అంబేద్కర్ రాజ్యాంగమేనని అన్నారు. జగన్ వంటి నాయకులు వస్తారని ఊహించే, భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారని అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని అన్నారు.
అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 1ని హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదు: లోకేశ్
ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసిందంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదంటూ అంబేద్కర్ రాజ్యాంగం నిరూపించిందని చెప్పారు.
న్యాయవాది అశ్విని కుమార్‌కి థ్యాంక్స్: దూళిపాళ్ల
జీవో 1 మీద హైకోర్టు తీర్పు శుభపరిణామమని దూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) అన్నారు. జీవో నంబర్ వన్ ను రద్దు చేసి న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని అప్రజాస్వామ్యపు అర్ధరాత్రి జీవోలను ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు న్యాయస్థానంలో ప్రతిపక్షాల గొంతును వినిపించిన న్యాయవాది అశ్విని కుమార్ కి ధన్యవాదాలని అన్నారు.
తింగరివేషాలు మానేయాలి: రఘురామ
వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందిస్తూ… ఏపీ సర్కారు జారీ చేసిన చీకటి జీవో నంబరు1ని హైకోర్టు కొట్టివేసిందని, తీర్పు అంటూ వస్తే తప్పనిసరిగా కొట్టేస్తారని తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. ఈ విషయంలో అయిదు నెలలు ఆలస్యమైనా న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇక నుంచైనా తింగరివేషాలు మానేయాలని వైసీపీకి ఆయన సూచిస్తూ ట్వీట్ చేశారు.