Chandrababu On Loan Apps : సమస్యకు చావు పరిష్కారం కాదు, లోన్ యాప్‌లపై ప్రభుత్వానికి చంద్రబాబు కీలక సూచన
సమస్యలకు చావు పరిష్కారం కాదని హితవు పలికారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

Chandrababu On Loan Apps : ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు.. అంతటా లోన్ యాప్ ల వేధింపులు పెరిగిపోయాయి. వ్యక్తుల ఆర్థిక అవసరాలను లోన్ యాప్ లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇచ్చిన డబ్బుకి వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్నాయి. డబ్బు చెల్లించకపోతే బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాయి. మార్ఫింగ్ ఫొటోలను పరువు తీస్తున్నాయి. వారి వేధింపులు భరించలేక అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు.
లోన్ యాప్ ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువకముందే ఇవాళ పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అంతేతప్ప, ఇలాంటి సమస్యలకు చావు పరిష్కారం కాదని హితవు పలికారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.
జీవనోపాధి కోసం రాజమండ్రికి వలస వచ్చిన దంపతులు.. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆన్ లైన్ లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నారు. కొంత నగదు చెల్లించారు. మిగతా డబ్బు సమయానికి చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఆగడాలు తట్టుకోలేక మనస్తాపంతో దంపతులు సూసైడ్ చేసుకున్నారు.
లోన్ యాప్ ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నేరుగా అధికారులకు చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో లోన్ యాప్ వేధింపుల వల్ల ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.