YSRCP : ఆ ముగ్గురు మాత్రమే సేఫ్..! 10మందిపై వేటు ఖాయం..! అనంత వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ టెన్షన్

అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పులు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అలజడి రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి ఉషశ్రీ చరణ్‌తోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపురాగా.. ఈ లిస్టులో ఇంకొందరు ఉన్నారనే సమాచారంతో ఎమ్మెల్యేలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట..
ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అలా అని ప్రతిసారి అదే జరుగుతుందనే ధీమాగా ఉండకుండా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల వడబోత మొదలవ్వగా.. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే వంతు ఎప్పుడొస్తుందో? ఎవరి సీటుకు ముప్పు వస్తుందోననే టెన్షన్‌తో గడుపుతున్నారు ఎమ్మెల్యేలు.

ఆ ముగ్గురికి మాత్రమే టికెట్.!
ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వైసీపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కన్ఫామ్‌గా టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి మాత్రమే టికెట్ భరోసా కనిపిస్తోంది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు భవిష్యత్‌పై రకరకాల చర్చ జరుగుతోంది.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. మళ్లీ గెలిపిస్తాయా? రిస్క్‌లో పడేస్తాయా? ఏం జరగనుంది

అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాల్లో మార్పు ఉండొచ్చనే సమాచారం ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తోంది. రాయదుర్గం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, అనంతపురం ఎమ్మెల్యేల పేర్లు గల్లంతు జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసొచ్చారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మంత్రికి, ఆ ఎమ్మెల్యేలకు టికెట్ డౌటే..
ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంట్రామిరెడ్డిని మార్చితే.. ఆయన సేవలు ఎలా వాడుకుంటారనేది ఆసక్తిరేపుతోంది. నాలుగుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకట్రామిరెడ్డిని తప్పిస్తారా? అన్నదీ డౌటే. కానీ, అధిష్టానం కొత్తవారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందంటున్నారు. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు టికెట్ లేనట్లేనని ప్రచారం జరుగుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వ్యతిరేకత దృష్ట్యా పక్కనపెట్టడం ఖాయమంటున్నారు.

మహిళ ఎమ్మెల్యే స్థానంలో డీఎస్పీకి టికెట్?
గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపైనా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వెనుబడిన వర్గాల నేతను ఎమ్మెల్యేగా బరిలో దింపాలని అధిష్టానం ఆలోచిస్తుండటంతో వెంకట్రామిరెడ్డి సీటుపై కత్తి వేలాడుతోందంటున్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా.. ఆమె భర్త సాంబశివారెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పద్మావతి స్థానంలో ఒక డీఎస్పీని పోటీకి పెట్టే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత..
అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో ధర్మవరం మినహా మిగిలిన అన్నిచోట్లా అభ్యర్థుల మార్పు ఉండొచ్చంటున్నారు. రాప్తాడు, పుట్టపర్తి, మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో కచ్చితంగా మార్పు ఉంటుందని చెబుతున్నారు. రాప్తాడులో పరిటాల కుటుంబంపై రికార్డు మెజార్టీతో గెలిచిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గ నేతలు కూడా ఆయన పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రకాశ్ రెడ్డి సోదరులు తమ ప్రవర్తనతో సీటు కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకున్నారంటున్నారు. ప్రకాశ్‌రెడ్డి స్థానంలో జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, మాజీ మంత్రి శంకర్ నారాయణ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే శంకర్‌నారాయణతో సీఎం జగన్ చర్చించారు. ప్రస్తుతం పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకర నారాయణను రాప్తాడు మార్చే పరిస్థితి కనిపిస్తోందని వైసీపీ వర్గాల సమాచారం. ఇక పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి సొంత సామాజిక వర్గంతోపాటు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలోకి కడపల శ్రీకాంత్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

Also Read : వైసీపీలో కీలకంగా మారిన మిథున్ రెడ్డి.. ఆ భారమంతా ఈయనపైనే మోపిన జగన్

తిప్పేస్వామి, సిద్ధారెడ్డికి నో టికెట్..!
మడకశిర విషయానికి వస్తే ఎమ్మెల్యే తిప్పేస్వామికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిప్పేస్వామికి ఈ సారి మొండిచేయి చూపడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిస్థితి ఏమంత అనుకూలంగా లేనట్లు చెబుతున్నారు. సొంత పార్టీ నేతలే సిద్ధారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చివరగా హిందూపురంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఇప్పటికే తప్పించి కురబ దీపికకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ, హిందూపురంలో స్ట్రాంగ్ లీడర్ నవీన్ నిశ్చల్ తనకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి ఉందంటున్నారు.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

మాధవ్ కు ఛాన్సే లేదు.!
మరోవైపు జిల్లాలో ఉన్న ఎంపీలను కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అసలు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. అనంత ఎంపీ తలారి రంగయ్యను ఎమ్మెల్యేగా బరిలోకి దించే ప్రతిపాదన ఉందంటున్నారు. మొత్తానికి అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు