CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. మళ్లీ గెలిపిస్తాయా? రిస్క్‌లో పడేస్తాయా? ఏం జరగనుంది

గతంలో పనిచేసిన పాదయాత్ర, వైఎస్ఆర్ తనయుడు అనే ట్యాగ్ లైన్‌, ఒక్క ఛాన్స్ అనే వ్యూహం ఇప్పుడు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు. గత ఐదేళ్ల పాలనే ప్రాతిపదికగా ప్రజా తీర్పును కోరాల్సివుంది.

CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. మళ్లీ గెలిపిస్తాయా? రిస్క్‌లో పడేస్తాయా? ఏం జరగనుంది

CM YS Jagan Sensational Decisions Strategy

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా భారీ స్థాయిలో చేస్తున్న సర్దుబాట్లు గేమ్ ఛేంజర్‌ అవుతాయా? లేక జగన్ రిస్క్ చేస్తున్నారా? అన్న చర్చకు తెరలేపాయి. అసలు సీఎం జగన్ మార్పు వ్యూహం వెనుక వ్యూహమేంటి? ఈ మార్పులతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హాట్ టాపిక్ గా జగన్ నిర్ణయాలు..
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేటట్లు భారీ సంఖ్యలో అభ్యర్థుల మార్పులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానచలనం.. కొందరికి నో టికెట్ అని నిర్మోహమాటంగా చెప్పేస్తుండటంపై విశ్లేషకులే విస్తుపోతున్నారు. గతంలో ఏ పార్టీలో లేనట్లుగా సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

వైఎస్ఆర్ తనయుడు ట్యాగ్ లైన్.. మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు
పార్టీ పెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ పాదయాత్ర.. అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత వెరసి 151 సీట్లతో భారీ విజయం అందుకున్నారు జగన్‌. అయితే గతంలో పనిచేసిన పాదయాత్ర, వైఎస్సాఆర్ తనయుడు అనే ట్యాగ్ లైన్‌, ఒక్క ఛాన్స్ అనే వ్యూహం ఇప్పుడు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

గత ఐదేళ్ల పాలనే ప్రాతిపదికగా ప్రజా తీర్పును కోరాల్సివుంది. ఈ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు సీఎం జగన్‌. తన గెలుపునకు అడ్డుగా నిలుస్తాయనే ఆటంకాలను అధిగమించేలా ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీఎం తీసుకున్న ప్రధాన నిర్ణయం ఇప్పుడు వైసీపీలోనూ.. రాష్ట్ర రాజకీయాల్లోనూ హీట్‌ పుట్టిస్తోంది.

ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..
మరో మూడు నెలలు సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు సీఎం జగన్‌. గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నందున ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై క్లారిటీ ఇచ్చేస్తున్నారు.. మార్పులుంటాయని.. ఎవరైనా సరే పార్టీ విజయం కోసం పనిచేయాలని గతంలోనే చెప్పిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఆ మార్పులను అమలు చేస్తుండటం ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తోంది.

ఎమ్మెల్యేలను షేక్ చేస్తున్న జగన్ తీరు..
పార్టీలో మార్పు చేర్పులతో ఎన్నికలకు వెళ్లడం ఏ పార్టీలో అయినా సహజమే. కానీ, సీఎం జగన్‌ నిర్ణయం మాత్రం పొలిటికల్‌ సర్కిల్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 60కి పైగా సీట్లలో మార్పులు చేస్తారనే ప్రచారమే వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కరిని పిలిచి.. ఉంచుతామనో.. ఊస్టింగ్‌ ఇచ్చేస్తున్నామనో చెప్పడంతో పార్టీలో హైటెన్షన్‌ వాతావరణాన్ని ఏర్పరిచింది. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను వేరే స్థానాలకు మార్చడం.. ఇంకొదరికి ఏకంగా ఎర్త్‌ పెడుతుండటంతో.. ఏ ప్రాతిపదికన.. ఏ సర్వే ఆధారంగా తమను తప్పిస్తున్నారో అంతుబట్టక మెజార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు.

ఎంపీల్లో కొత్త ఆశలు..
సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తారనే ప్రచారం.. ఎంపీల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న 22 మంది ఎంపీల్లో 15 మంది సిట్టింగులకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఇక 20 మంది ఎమ్మెల్యేలను లోక్‌సభకు పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా 30 మందికి పైగా కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 5 నుంచి 7 స్థానాల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. మొత్తం 175 స్థానాల్లో 36 రిజర్వు స్థానాలు పోగా మిగిలిన వాటిలో 50 సీట్లను బీసీలకు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

పార్టీలో అసమ్మతికి దారి తీయదా?
మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంత భారీ సంఖ్యలో మార్పులు చేపట్టడం పార్టీలో అసమ్మతికి దారి తీయదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు గేమ్ ఛేంజర్‌గా మారుతాయా.. లేక బూమరాంగ్ అవుతాయా అనే చర్చ జరుగుతోంది.. జగన్ రిస్క్ చేస్తున్నారని కొందరు విశ్లేషకులూ అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్..!
అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కొందరు సిట్టింగులను మార్చి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవనే విశ్లేషణలు.. మార్పు నిర్ణయం తీసుకోడానికి సీఎం జగన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసేందంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ నిర్ణయాలు వ్యూహాత్మకమా.. లేక మరోదారి లేక తీసుకుంటున్న నిర్ణయాలా? అనే సంశయం పొలిటికల్ సర్కిల్స్‌లో తలెత్తుతోంది. అభ్యర్థుల మార్పుపై తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఎలా ఉన్నా.. అది సీఎం జగన్‌కే చెందుతుందంటున్నారు.