Lemon Price Drop : పాపం రైతన్నలు.. నెల రోజుల్లోనే రూ.5000 తగ్గిన ధర.. మరింత పడిపోయేందుకు ఛాన్స్..!
Lemon Price Drop : ఆంధ్రప్రదేశ్ నిమ్మ రైతులకు భారీ షాక్ తగిలింది. నెల రోజుల వ్యవధిలోనే రూ.5000 వేల మేర నిమ్మ ధర పతనం అయ్యింది.
lemon rates drop from rs 8500 to 3500 per 50 kg bag in ap eluru market
- ఏపీలో భారీగా పడిపోయిన నిమ్మ ధర
- నెలలోనే రూ.5000 తగ్గిన రేటు
- రూ.8,500 నుంచి రూ.3500కి పతనం
Lemon Price Drop : అన్నదాతలతో ఇటు వ్యవస్థ మాత్రమే కాక ప్రకృతి కూడా ఆడుకుంటోంది. సకాలంలో వర్షాలు కురవవు.. పంట చేతికి వచ్చే ముందు అకాల వర్షాలు కురిసి నీటిపాలవుతుంది. అలానే పండిన పంటకు ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని నిమ్మ రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గత నెల ఇదే సమయానికి 50 కేజీల నిమ్మ బస్తా ధర రూ. 8,500 ఉండగా, ఈరోజు అది రూ. 3,500కు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే ఇంత దారుణంగా ధర పడిపోవడంతో అన్నదాతల బాధ వర్ణనాతీతం.
వేసవి కాలంలో నిమ్మకాయలకు రేటు ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో నిమ్మకాయ రూ. 10 పలుకుతుంది. కానీ, ఇదే రైతు దగ్గరికి వస్తే ఈ ధర అస్సలు కనిపించదు. ఇప్పుడు ఏపీ నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నిమ్మ ధరలు హఠాత్తుగా పడిపోవడంతో.. అన్నదాతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో 50 కేజీల బస్తా రూ. 8,500 ఉండగా.. ప్రస్తుతం అదే బస్తా రూ. 3,500కు ఒక్కసారిగా పడిపోయింది. ఇటీవల వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఇలా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఏపీలోని ఏలూరు నిమ్మకాయల మార్కెట్ నుంచి ముంబై, మద్రాసు, కర్ణాటక, బెంగళూరు వంటి ఇతర ప్రాంతాలకు భారీ స్థాయిలో నిమ్మకాయలను ఎగుమతి చేసేవారు. అయితే ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండటంతో.. ఇప్పుడు ఏలూరు మార్కెట్ యార్డుకు ప్రతి రోజు కేవలం 20-30 లారీలు మాత్రమే వస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులు నిమ్మతోటలను సాగు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగుమతులు లేక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పైగా పోయిన నెల నుంచి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, అకస్మాత్తు వర్షాల కారణంగా నిమ్మకు మంచి రేటు ఉన్నప్పటికీ దిగుబడి బాగా తగ్గింది. మొన్నటి వరకు కేజీ నిమ్మ ధర రూ. 170 వరకు పలగ్గా.. ఇప్పుడు రూ. 70కి పడిపోయింది. దీంతో నిమ్మ సాగు చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్ వన్ రకం కేజీ నిమ్మ ధర రూ. 70 పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో వర్షాలు కురవడంతో ఆ ప్రభావం నిమ్మ ఎగుమతులపై పడింది. ఆకస్మాత్తుగా నిమ్మ ధర ఇంత పెద్ద మొత్తంలో తగ్గిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధరలు మరింత తగ్గిపోయే పరిస్థితి ఉందని, పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
