Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట బాధితులకు చెక్కులు పంపిణీ.. వారికి ఇచ్చే పరిహారం ఎంతంటే..

తిరుపతి తొక్కిసలాట బాధితులకు చెక్కుల పంపిణీ ప్రారంభించింది టీటీడీ.

Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట బాధితులకు చెక్కులు పంపిణీ.. వారికి ఇచ్చే పరిహారం ఎంతంటే..

Updated On : January 12, 2025 / 9:53 PM IST

Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ముగ్గురు బాధిత కుటుంబసభ్యులకు టీటీడీ ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేసింది. విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో మృతుల కుటుంబాల నివాసాలకు వెళ్లిన టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యేలు ఈ చెక్కులు అందించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబసభ్యులను వారు ఓదార్చారు. తిరుపతి ఘటన దురదృష్టకరం అన్నారు హోంమంత్రి అనిత. ఆరుగురు చనిపోతే అందులో నలుగురు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారే అని తెలిపారు. బాధిత కుటుంబాలకు చెక్కులు ఇవ్వడమే కాకుండా వారికి అండగా కూడా ఉంటామని భరోసా ఇచ్చారు.

తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఇదే..
తిరుపతి తొక్కిసలాట బాధితులకు నేటి నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించింది టీటీడీ. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించింది. ఎక్స్ గ్రేషియాపై టీటీడీ బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఆరుగురు మృతుల కుటుంబసభ్యులకు పాలక మండలి సభ్యులు స్వయంగా వెళ్లి చెక్కులు అందిస్తున్నారు.

చెక్కుల పంపిణీకి బోర్డు సభ్యులతో ఇప్పటికే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. వైజాగ్, నర్సీపట్నంకు వెళ్లిన బృందంలో జ్యోతుల నెహ్రూ, జంగా క్రిష్ణ మూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఇక తమిళనాడు, కేరళకు వెళ్లిన బృందంలో రామ్మూర్తి, క్రిష్ణమూర్తి వైద్యనాథన్, నరేశ్ కుమార్, శాంతారామ్, సుచిత్ర ఎల్లా ఉన్నారు. స్థానిక శాసనసభ్యులతో కలిసి బాధితుల దగ్గరికి వెళ్తున్నారు టీటీడీ బోర్డు సభ్యులు.

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున.. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు. స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.2లక్షల చొప్పున పరిహారంగా ఇస్తోంది టీటీడీ.

 

 

Also Read : తిరుమల తొక్కిసలాట ఘటనపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది: జగన్