Chevireddy Bhaskar Reddy
Ongole MP Candidate : ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను మార్పులు చేస్తుండటంతో.. ఎవరి స్థానం పదిలంగా ఉంటుంది.. ఎవరి సీటుకు చెక్ పడుతుందనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఆ పార్టీలో అసంతృప్తులను రాజేస్తున్నాయి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలాఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో మాజీ మంత్రి బాలినేనిని కలిశారు. ఒంగోలు పార్లమెంట్ నుంచి తాను బరిలోకి దిగుతున్నానని చెప్పినట్లు తెలిసింది. అయితే, మాగుంట శ్రీనివాస్ రెడ్డివైపే బాలినేని మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : YS Sharmila : చంద్రబాబు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం
ఒంగోలు ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేనితో హైదరాబాద్లో వైసీపీ అదిష్టాన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. జిల్లా వైసీపీ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ పెట్టేందుకు వీరిని సీఎం జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. బాలినేని ముద్దు.. మాగుంట వద్దు అనే నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు పరోక్షంగా విజయసాయిరెడ్డి ఇప్పటికే సంకేతాలిచ్చారు. బాలినేనిని బుజ్జగించి ఒక్క ఎంపీ విషయం తప్ప మిగతా డిమాండ్లకు సానుకూలం వ్యక్తం చేసి అతన్ని ఒప్పించే దిశగా వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బాలినేని వైసీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో భారీగా నష్టపోతామని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రత్యామ్నాయాలను వైసీపీ అధిష్టానం సిద్ధం చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Also Read : AP Politics : ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం.. పార్థసారథి వ్యవహారంలో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ
సీఎం జగన్ ను శుక్రవారం ఒంగోలు పారిశ్రామిక వేత్త, మంత్రి బొత్సాకు సమీప బంధువైన కంది రవిశంకర్ కలిశారు. దీంతో ఒంగోలులో కొత్త ప్రచారం మొదలైంది. ఇతని కలయిక లోక్ సభకా? బాలినేనికి ప్రత్యామ్నాయమా అంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తన కార్యాలయంలో అనుచరులతో ఎంపీ మాగుంట కీలక భేటీ నిర్వహించారు. మరోవైపు వైసీపీ అదిష్టానం తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న టీజేఆర్ శుక్రవారం వైసీపీ నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ పరిచయ వేదిక సమావేశానికి డుమ్మాకొట్టాడు. దీంతో టీజేఆర్ పై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే టీజేఆర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం జగన్ కు సిఫార్సు చేసేందుకు విజయసాయి రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. అయితే, టీజేఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది
Also Read : ఇటు వైసీపీ కీలక నేతలకు గాలం, అటు గ్రూపు తగాదాలు పరిష్కారం.. ఎన్నికల వేళ చంద్రబాబు అదిరిపోయే వ్యూహం
జిల్లా రాజకీయాల్లో బాలినేని, ఎంపీ మాగుంట జోడివైపు వైసీపీ రాజకీయాలు కాక రేపుతుండటంతో కత్తికి రెండు వైపుల వైసీపీ అధిష్టానం పదును పెట్టింది. మాగుంట వద్దు బాలినేని ముద్దు అనే కాన్సెప్ట్ కు బాలినేని మెత్తబడితే ఓకే.. అలాకాకుండా వ్యతిరేకంగా బాలినేని నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే వైసీపీ అధిష్టానం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయానికి బాలినేని ఒకే అంటే ఒంగోలు పారిశ్రామికవేత్త, బాలినేనికి మంచి సన్ని హితుడైన కంది రవిశంకర్ ను ఒంగోలు లోక్ సభకు, బాలినేనిని అసెంబ్లీ నుండి బరిలోకి దింపాలనే యోచనలో వైసీపీ అదిష్టానం వ్యూహంగా కనిపిస్తుంది. అలాకాకుండా బాలినేని వైసీపీ అదిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే.. బాలినేని, ఎంపీ మాగుంట స్థానాల్లో.. చేవిరెడ్డి బాస్కర్ రెడ్డిని లోక్ సభ నుండి, రవిశంకర్ ను అసెంబ్లీ అభ్యర్థుల జోడిగా ఒంగోలు బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఒంగోలు లోక్ సభనుండి తనకు పోటీచేసే అవకాశం ఇవ్వాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కోరుతున్నారు.