ఇటు వైసీపీ కీలక నేతలకు గాలం, అటు గ్రూపు తగాదాలు పరిష్కారం‌.. ఎన్నికల వేళ చంద్రబాబు అదిరిపోయే వ్యూహం

వివాదం అవుతాయనుకున్న ప్రతిచోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందంటూ ఎగిరి గంతేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇటు వైసీపీ కీలక నేతలకు గాలం, అటు గ్రూపు తగాదాలు పరిష్కారం‌.. ఎన్నికల వేళ చంద్రబాబు అదిరిపోయే వ్యూహం

Chandrababu Naidu Strategy

Updated On : January 13, 2024 / 12:38 AM IST

Chandrababu Naidu : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి కీలక నేతలను ఓవైపు టీడీపీలో చేర్చుకుంటూనే.. మరోవైపు పార్టీలోని వర్గ విభేదాలను పరిష్కరిస్తున్నారు. ఎక్కడా సీట్ల పంచాయితీలు, గ్రూపు తగాదాలు రాకుండా ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. చకచకా పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు టీడీపీ అధినేత.

కొత్త సంవత్సరంలో టీడీపీలో కొత్త ఉత్సాహం..
అధికార వైసీపీ నుంచి కీలక నేతలు టీడీపీలోకి క్యూ కడుతుంటంతో కొత్త సంవత్సరం తమకు బాగా కలిసి వస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు చాలా ఏళ్లుగా పార్టీ నేతల మధ్య ఉన్న వివాదాలు కూడా పరిష్కారం అవుతుండటంతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. విజయవాడలో రెండేళ్లుగా కేశినేని బద్రర్స్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మొదటి నుంచి టీడీపీ అధిష్టానం కేశినేని చిన్ని వైపు మొగ్గు చూపుతున్నా.. నాని సిట్టింగ్‌ ఎంపీగా ఉండటంతో సంయమనం పాటిస్తూ వచ్చింది.

కలిసొచ్చిన తిరువూరు ఎపిసోడ్..
పార్లమెంట్‌ పరిధిలోని పలువురు నేతలతో నానితో ఉన్న వివాదాలపై పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా కేశినేని గెలుపొందడమే దీనికి కారణం. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాని, చిన్ని మధ్య ఉన్న గ్యాప్‌ అంశాన్ని ఎలా సరిచేయాలా అని ఆలోచించింది. తిరువూరు ఎపిసోడ్‌ కలిసి వచ్చి కేశినేని నానీయే పార్టీని వీడటంతో ఇక్కడి వివాదానికి పుల్‌స్టాప్‌ పడింది. ఎన్నికల్లో అన్నదమ్ముల పంచాయితీతో పార్టీకి ఇబ్బంది కలుగుతుందనుకున్న తరుణంలో నాని వెళ్లిపోవడం టీడీపీకి కలిసివచ్చింది.

Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?

గుడివాడలో వివాదానికి ఫుల్ స్టాప్..
అటు.. గుడివాడలో NRI వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వర్‌రావు మధ్య వివాదాన్ని కూడా చంద్రబాబు ఇలాగే పరిష్కరించారు. దాదాపు ఏడాదిపాటు గుడివాడలో రెండు వార్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో వెంకటేశ్వర్‌రావును పిలిపించుకొని మాట్లాడిన చంద్రబాబు.. సమస్య సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత గుడివాడ ఇన్‌చార్జిగా వెనిగండ్ల రాముని ప్రకటించారు.

ఏవీ సుబ్బారెడ్డిని దూరంగా ఉంచి..
నంద్యాలలోనూ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీమంత్రి ఎండీ ఫరూక్‌ వర్గాల మధ్య వివాదాన్ని కూడా చిటికెలో పరిష్కరించారు చంద్రబాబు. నంద్యాలలో ఇన్‌చార్జిగా ఉన్న బ్రహ్మానందరెడ్డిని తప్పించి.. అక్కడ ఫరూక్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు రా.. కదలిరా సభకు ఏవీ సుబ్బారెడ్డిని దూరంగా ఉంచి ఘర్షణలకు తావు లేకుండా చేశారు.

అనంతలో జేసీని, విశాఖలో గంటాను సెట్ చేసేశారు..
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారంలో కూడా చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు. దివాకర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జేసీ పవన్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడంతో పార్టీ వర్గాల్లో వ్యతిరేక వచ్చింది. ఈసారి కూడా జేసీ కుటుంబం పోటీలో నిలిస్తే.. తలనొప్పి తప్పదని భావించిన చంద్రబాబు.. అనంతపురం పార్లమెంట్‌ సీటు బీసీలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఇక విశాఖలో అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య గ్రూప్‌ పాలిటిక్స్‌ పార్టీకి చేటు చేస్తాయని అందరూ భావించారు. దీంతో ఒకరి పరిధిలోకి ఒకరు రాకుండా గిరిగీసి పెట్టడంతోపాటు.. ఇరువురి మధ్య వివాదాలు రాకుండా సెట్‌ చేస్తున్నారు.

Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్

తన రాజకీయ అనుభవంతో సమస్యలకు పరిష్కారం..
మరోవైపు.. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్న చంద్రబాబు.. దాన్ని పరిష్కరించే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలా వివాదం అవుతాయనుకున్న ప్రతిచోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందంటూ ఎగిరి గంతేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.