Free Bus Travel: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆయన మరింత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళందరికీ ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు చంద్రబాబు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు చంద్రబాబు.
శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని మరోసారి చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని చంద్రబాబు కోరారు.
Also Read: పరిధి దాటిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విమర్శ.. మహిళ అని చూడకుండా అడ్డగోలు మాటలు
”అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ పెంచాము. గత ప్రభుత్వం ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచితే, మేము ఒకేసారి ఆ మొత్తాన్ని పెంచాము. పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి ఒక పెద్ద వరం. రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే రాయలసీమలో కరువు ఉండదు” ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్’ ఎన్నికల హామీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం. ఆగస్టు 15 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3,182 కోట్ల మేర భారం పడనుందని అంచనా. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 69 శాతం ఉండగా, అది 94 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా నిత్యం మరో 10.84 లక్షలకు పెరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మంత్రుల బృందం ఫిబ్రవరిలో కర్ణాటకలో పర్యటించింది. అక్కడ అమలవుతున్న ఉచిత బస్ పథకంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.