Gossip Garage: పరిధి దాటిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విమర్శ..

తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్‌రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది.

Gossip Garage: పరిధి దాటిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విమర్శ..

Updated On : July 9, 2025 / 12:46 PM IST

Gossip Garage: పాలిటిక్స్ అన్నప్పుడు విమర్శలు కామన్. కానీ విమర్శకు కూడా హద్దు అదుపు ఉంటుంది. రాజకీయంగా లైన్‌ క్రాస్‌ చేయకుండా ఎన్ని విమర్శలు చేసినా ఓకే. బట్‌ వన్స్ టంగ్ స్లిప్‌ అయితే చాలు..కార్నర్ కావాల్సి వస్తుంది. కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఇదే సిచ్యవేషన్‌ను ఫేస్ చేస్తున్నారు.

అవినీతిలో ప్రసన్నకుమార్‌రెడ్డి Phd చేశారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా హద్దు మీరి మాట్లాడారు. మాటల్లో చెప్పలేనంత..అలా అని బూతు పదాలు వాడకుండా..మహిళలను వ్యక్తిగతంగా ఎలా మాట్లాడద్దో అలా నోరు పారేసుకున్నారు ప్రసన్నకుమార్‌రెడ్డి. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేత నోటి నుంచి.. బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయా.? అన్నట్లుగా ఆయన తీరు ఉండటం విస్తుపోయేలా చేస్తోంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ..దారుణ వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న సోయి లేకుండా..మర్యాదకు ఆమడ దూరంలో ప్రసన్నకుమార్‌రెడ్డి కామెంట్స్ ఉన్నాయ్.

మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి..
ఆయన చేసిన కామెంట్స్‌ తర్వాత..సోమవారం రాత్రి నెల్లూరు నగరంలోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాత్రి ఎనిమిదిన్నర – తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారు ధ్వంసం చేయటమే కాదు..ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్.. కుర్చీలను విరగ్గొట్టారు. కిటికీలు పగలగొట్టారు. ఇంట్లో ఉన్న దుస్తులు బయటకు తీసుకొచ్చి తగలపెట్టారు. ఈ దాడి జరిగినప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరు. దాడి ఘటన జరిగిన తర్వాత.. వైసీపీ నేతలు పలువురు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చి..దాడికి టీడీపీకి చెందిన వారేనంటూ ఆరోపించారు.

Also Read: ఏపీ రాజకీయాలను హీటెక్కించిన మామిడి.. సీఎం సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ పొలిటికల్ వార్..

అయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి మీద దాడికి తమకేం సంబంధం లేదని..ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఆయన ఇంటి దాడి జరిగిన దాడిని ఖండిస్తూనే ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ మీద తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు కూటమి నేతలు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. నెల్లూరులో అక్కడక్కడ నిరసనలు కూడా జరిగాయి. మహిళల జోలికి వచ్చినా..అవాకులు, చెవాకులు మాట్లాడినా జాగ్రత్త అంటూ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.

జైల్లో పెట్టినా సంతోషంగా వెళ్తా..
అయితే తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్‌రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది. తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని..తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పర్వాలేదంటున్నారు ప్రసన్నకుమార్‌రెడ్డి. తనపై కేసు నమోదు చేసి..జైల్లో పెట్టినా సంతోషంగా జైలుకి వెళ్తానంటూ..ఆయన చెప్పడం మరింత సంచలనంగా మారింది.

అయితే ప్రసన్నకుమార్‌రెడ్డి తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీసేందుకు జగన్ పంపిన స్క్రిప్టును ప్రసన్నకుమార్ రెడ్డి చదివారని..అలజడులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా..మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం సమర్ధనీయం కాదు. ఏ పార్టీ వారైనా..ఏ నేత మాట్లాడినా మహిళల విషయంలో పర్సనల్‌ విషయాల జోలికి వెళ్లి అడ్డగోలుగా మాట్లాడి..తమతో పాటు పార్టీని ఇరకాటంలో పడేయటం ఎంత వరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రసన్నకుమార్‌రెడ్డి కామెంట్స్‌పై వైసీపీ అధినేత జగన్ స్పందించాలని డిమాండ్ చేస్తోంది కూటమి. ఎమ్మెల్యేపై చేసిన కామెంట్స్ విషయంలో తగ్గనంటున్న ప్రసన్నకుమార్‌రెడ్డి మనసు మార్చుకుని సారీ చెప్తారా? లేక ఈ రచ్చను ఇలానే కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి.