Gossip Garage: ఏపీ రాజకీయాలను హీటెక్కించిన మామిడి.. సీఎం సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ పొలిటికల్ వార్..
జగన్‌ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్‌పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.

Chandrababu-Jagan
Gossip Garage: మధురమైన మామిడి ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరులో మ్యాంగో రైతుల సెంట్రిక్‌గా టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మామిడి రైతుకు గిట్టుబాటు కల్పించడంతో ప్రభుత్వం ఫెయిల్ అయిందని వైసీపీ రోడ్డెక్కుతోంది. మామిడి రైతుల కేంద్రంగా రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలైంది. అయితే తోతాపురి మామిడిని కొనుగోలు చేసే పరిశ్రమల నుంచి టన్ను కు రూ.8 వేలు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా టన్నుకు రూ.4 వేలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపింది. ఆల్రెడీ మామిడి కొనుగోళ్లు కూడా అయిపోయాయని..ఇప్పుడొచ్చిన జగన్ చేసేదేం లేదంటోంది టీడీపీ.
ఓ పక్క ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నప్పటికీ మామిడి రైతుల కష్టాలు అంటూ వైసీపీ రచ్చకెక్కడంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 9న పూతలపట్టు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నారు మాజీ సీఎం జగన్. మామిడి రైతుల కష్టాలు, గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వస్తుండడంతో వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
అయితే జగన్ పర్యటన జరిగే తీరును కూటమి నేతలు తప్పుపడుతున్నారు. రైతులను రాజకీయాల కోసం వాడుకోవడం వైసీపీకే చెల్లిందంటున్నారు. జగన్‌ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్‌పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ. ఎన్ని అడ్డంకులు కలిగించినా జగన్ రావడం ఖాయం, రైతులను కలవడం కూడా పక్కా అని చెప్తోంది ఫ్యాన్ పార్టీ.
దండయాత్రలా పర్యటనకు వస్తామంటేనే కుదరదు..
జగన్ పరామర్శకు వస్తే నో ప్రాబ్లమ్..దండయాత్రలా పర్యటనకు వస్తామంటేనే కుదరదని కూటమి వాదిస్తోంది. ఓదార్పులు, పరామర్శలకు ఎవరైనా వెళ్లొచ్చు కానీ బలప్రదర్శన కోసం రావద్దంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి..రాజకీయాల కోసం రైతులను వాడుకోవద్దని కూటమి లీడర్లు సూచిస్తున్నారు.
జగన్ చిత్తూరు పర్యటనకు పోలీసుల ఆంక్షలు..
మరోవైపు రెంటపాళ్ల టూర్‌లో జరిగిన ఘటనలతో..జగన్ చిత్తూరు పర్యటనకు పలు ఆంక్షలు పెట్టారు పోలీసులు. జగన్ వెళ్లాల్సిన బంగారుపాళేనికి 30 మందికి మాత్రమే అనుమతిస్తామంటున్నారు. అక్కడ ఇరుకుగా ఉంటుంది కాబట్టి రిస్ట్రిక్షన్స్ పెట్టామని చెబుతున్నారు. హెలిపాడ్ దగ్గర జగన్‌కు స్వాగతం పలడానికి కూడా 30 మందికే పర్మిషన్ అంటున్నారు.
ర్యాలీలు ఊరేగింపులు వంటివి లేకుండా జగన్ పర్యటన కేవలం పరామర్శగానే ముగించాలని సూచించారు. అయితే పోలీసుల షరతులను వైసీపీ నేతలు పాటిస్తే ఇబ్బందేం లేదు. అలా కాకుండా సవాల్‌గా తీసుకుంటేనే ఇష్యూ అయ్యే పరిస్థితి. జగన్ రెంటపాళ్ల టూర్‌కు కూడా వంద మందికి మాత్రమే అనుమతిచ్చారు. కానీ జగన్ వచ్చే సమయానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు.
ఏది ఏమైనా జగన్ పర్యటనలు కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారి..రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. పోలీసులు వర్సెస్ వైసీపీగా మారుతున్నాయి పరిస్థితులు. పరామర్శలు ఓదార్పులకు వేలాది మంది జనాలతో హంగామా చేయడం అవసరమా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ అధినేత పర్యటనలకే ఆంక్షలు రూల్స్ పెడుతున్నారని..ఇదంతా కూటమి ఆడుతోన్న రాజకీయ డ్రామా అంటున్నారు వైసీపీ నేతలు.
ఇలా అటూ ఇటూ కూడా పట్టుబట్టి ఉండటంతో జగన్ టూర్‌పై మ్యాంగ్ ఫార్మర్స్ సెంట్రిక్‌గా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అయితే జగన్ పర్యటనతో మామిడి రైతులకు మేలు ఎంత జరుగుతుందో తెలియదు కానీ..మ్యాంగో రైతులు రాజకీయ అస్త్రంగా మార్చారన్న చర్చ జరుగుతోంది. ఈసారి జగన్ పర్యటనను పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.