Cm Chandrababu : ఢిల్లీ ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఢిల్లీ ఫలితాలు చరిత్రాత్మకం అన్నారాయన. కేజ్రీవాల్ పాలనపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్, కేజ్రీవాల్ ఒకేలా పాలన చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో కొందరు బటన్ నొక్కి మాయమాటలు చెప్పారని విరుచుకుపడ్డారు. పొలిటికల్ కరప్షన్ చేశారని ఆరోపించారు.
అటు.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు. దేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ మోదీ అని కితాబిచ్చారు. కొందరికి ఇష్టం ఉన్నా లేకున్నా మోదీనే దేశానికి లీడర్ అని చెప్పారాయన.
”ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ. పంజాబ్ అంటే ఒకప్పుడు మంచి రాష్ట్రంగా పేరు ఉంది. అలాంటిది ఇప్పుడు పంజాబ్ లో డ్రగ్స్ వచ్చాయి. లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన కుటుంబాలు పైకి రావు. పేదల ఉసురు తగిలి ఆ కుటుంబాలు పైకి ఎదగలేవు” అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఓటు వేసిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉండదు..
”రాష్ట్రం కోసం ఎవరు ఏం చేస్తున్నారనే దానిపై చర్చ జరగాలి. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఓటు వేసిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఆలోచించాలి. మోదీ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లో నిరసనలు చేస్తే అణిచివేయాలని చూసిన వారు ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు.
కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మోదీ దేశాన్ని నెంబర్ వన్ చేయాలని చూస్తే.. నేను రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలని చూస్తున్నా. నేను ఏది మంచి అయితే అదే చేస్తా. నేను వ్యక్తులను విమర్శించడం లేదు. వారు అవలంభించే విధానాలు సరి కాదు. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఆదరణ కోల్పోయారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.