Cm Chandrababu: ఏపీలో ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. మూడేళ్లల్లో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్న చంద్రబాబు.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు ఉండేలా చూడాలన్నారు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను వేగంగా పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వ కక్ష సాధింపుతో నిలిచిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ బిల్లులు వచ్చేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు.
టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకుపైగా ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని, ఇది ఇక్కడితో ఆగకూడదని, మరింత వేగంగా వెళ్లాలని అధికారులతో చెప్పారు. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
”కూటమి ప్రభుత్వం సుమారు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తై గృహ ప్రవేశాలు చేసుకున్నాం. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే మూడేళ్లల్లో పూర్తవ్వాలి. ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
Also Read: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. ఏమైందంటే?