Ayesha Meera: చనిపోయిన 18ఏళ్లకు అంత్యక్రియలు.. ఆయేషా మీరా కేసు క్లోజ్
ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Ayesha Meera Representative Image (Image Credit To Original Source)
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన కేసు
- 2007లో హాస్టల్ లో ఆయేషాపై అత్యాచారం చేసి చంపేశారని ప్రధాన ఆరోపణ
- నిందితులను గుర్తించడానికి ఆధారాలు లభించలేదన్న సీబీఐ
Ayesha Meera: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన బీ-ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాఫ్తు ముగిసింది. ఈ కేసు దర్యాఫ్తును ముగిస్తున్నట్లుగా విజయవాడ సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. సీబీఐ సమర్పించిన తుది నివేదికను కోర్టు ఆమోదించింది. వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది న్యాయస్థానం. ఈ నెల 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది కోర్టు.
ఫిబ్రవరి 27న తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశం..
ఆయేషా హత్య కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ ఇటీవల కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా న్యాయస్థానం ఆమోదించింది. దర్యాఫ్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్ట్ మార్ట్ం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ల అభిప్రాయం తీసుకున్న అనంతరం అవశేషాలను సీబీఐ కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో తమ కుమార్తె అవశేషాలను అంత్యక్రియల నిమిత్తం తమకు అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 27న తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అవశేషాల తరలింపునకు ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నం హాస్టల్ లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. 18ఏళ్లుగా సాగుతున్న దర్యాఫ్తులో నిందితులను గుర్తించలేకపోయారు.
ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కినా.. దక్కని న్యాయం..
రెండు దశాబ్దాలుగా ఆయేషా ఆత్మ రోదిస్తూనే ఉంది. ఆ రోజు హాస్టల్ లో ఆయేషా చేసిన అరుపులు తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కినా, ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిరిగినా నిరీక్షణ తప్ప న్యాయం దొరకలేదు. సీబీఐ విచారణ చేపట్టింది. సమాధిని తవ్వారు. రెండోసారి పోస్టుమార్టం చేశారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. హంతకుడి నీడ కూడా కనిపించలేదు. సాక్ష్యాలు లేవు అని కేసు మూసేశారు.
బీఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్యాచారం కేసు సంచలనం రేపింది. 2007లో హాస్టల్లో ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు అనేది ప్రధాన ఆరోపణ. 2009లో సత్యంబాబును దోషిగా తేల్చారు. 2017 వరకు జైల్లో ఉంచారు. ఆ తర్వాత అతడు నిర్దోషి అని తేలింది. అయితే, అసలైన దోషిని పట్టుకోవడం లేదని ఆయేషా పేరెంట్స్ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఇన్నేళ్ల విచారణలో ఆధారాలేమీ దొరకలేదని సీబీఐ కోర్టుకి నివేదిక ఇచ్చింది. దీంతో ఈ కేసును క్లోజ్ చేసింది విజయవాడ సీబీఐ ప్రత్యేక కోర్టు.
Also Read: బీసీ రిజర్వేషన్ల పెంపుపై కూటమి బిగ్ ప్లాన్..! ఏంటీ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా?
