ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఎవరెవరిని కలిశారు, ఏమేం చర్చించారంటే..

అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం కోరారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి ఆయన వాకబు చేశారు.

Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్ర పునర్ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని కోరారు చంద్రబాబు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా నిధులు అందేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

మోదీతో సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు చంద్రబాబు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించారు. సత్వరమే నిధుల విడుదల జరిగేలా చూడాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగిన భేటీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమిత్ షాతో సీఎం చంద్రబాబు సుమారు గంటన్నర పాటు సమావేశం అయ్యారు. అమిత్ షా, చంద్రబాబుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాతో భేటీలో రాజకీయ అంశాల గురించి చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ లోక్ సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు వాకబు చేశారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్ చేయాలని విన్నవించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

 

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?