బద్వేల్ బాలిక ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..

నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Badvel Girl Incident (Photo Credit : Google)

Badvel Girl Incident : కడప జిల్లా బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలిక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం తీవ్ర వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ ఘటనలో పడే శిక్ష హెచ్చరికలా ఉండాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ప్రాణాలు విడిచింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన విఘ్నేశ్ అనే యువకుడు.. శనివారం నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ మృత్యువుతో పోరాడి ఓడింది.

బాధితురాలిని గోపవరం మండలంలోని సెంచురీ ప్లైవుడ్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లిన విఘ్నేశ్.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన నాలుగు పోలీసు బృందాలు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ కేసు వివరాలను కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు మీడియాకు తెలిపారు. ”ఆ పాప.. పెళ్లి చేసుకోవాలని విఘ్నేశ్ ను అడిగింది. ఇష్టం లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని విఘ్నేశ్ అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పాపపైన పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలిసింది. వెంటనే మూడు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. నిందితుడి కోసం గాలించాడు. అతడి పేరెంట్స్ ఎవరో కనుక్కుని, డీటైల్స్ అన్ని తెలుసుకున్నాము. ఇవాళ 12 గంటల సమయంలో కడప శివారులో నిందితుడిని పట్టుకున్నాం. బాలిక ఏదైతే వాంగ్మూలం ఇచ్చిందో విఘ్నేశ్ కూడా అదే చెప్పాడు” అని కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు.

బద్వేల్ ఇంటర్ విద్యార్థిని ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోతున్నారు, ఇదేం రాజ్యం సీబీఎన్ గారు.. అంటూ ట్వీట్ చేశారు జగన్. ప్రతి రోజు ఏపీలో ఏదో ఒక చోట హత్యాచారాలు, హత్యలు, దోపిడీలు సర్వ సాధారణమైపోయాయని మండిపడ్డారు జగన్. బద్వేల్ బాలిక ఘటన అత్యంత హేయం, దుర్మార్గం అన్నారు జగన్.

Also Read : ఏపీలోకి వచ్చి కాల్పులు జరిపిన తెలంగాణ పోలీసులు.. అసలేం జరిగిందంటే..