Cm Chandrababu Naidu : వైసీపీ అరాచకాలకు కేరాఫ్ గా మారిందని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆ భూతాన్ని శాశ్వతంగా పాతి పెట్టాలని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం ఇచ్చిన డబ్బులను సైతం మళ్లించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాల వల్ల ప్రస్తుతం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వాపోయారు.
ఐదున్నర కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి. 29 గ్రామాల ప్రజలు 34 వేల ఎకరాల భూమిని అమరావతి రాజధాని కోసం ఉదారంగా ఇచ్చారు. ప్రజా రాజధాని నిర్మాణం కోసం అందరూ ఎదురుచూశారు. ఏపీ విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ కొరతను తీర్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు ప్రజా రాజధాని నిర్మాణానికి కంకణం కట్టుకున్నారు.
అమరావతి ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి నిర్మాణం పనులు వేగవంతమయ్యాయి.
Also Read : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం
రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో నిరాశ్రయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని నిర్మించాలి, అది ప్రజా రాజధానిగా ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని తలపించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలలకు ప్రతిరూపమే అమరావతి ప్రజా రాజధాని. దీనికి సంబంధించి భూసేకరణ చేయడం, ప్రజలను ఒప్పించడం, 29 గ్రామాల ప్రజల ఆమోదంతో 34వేల ఎకరాల భూమిని సమీకరించి అమరావతి ప్రజా రాజధాని నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి అన్ని వ్యవస్థలు ఒకే ప్రాంతంలో ఉండాలి, అన్ని వింగ్ లు ఒకే దగ్గర ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలి, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి, అదే విధంగా అధికారులకు, పరిపాలన చేసే యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులంతా ఒకే దగ్గర ఉండాలనే సంకల్పంతో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి సంకల్పించారు చంద్రబాబు.
అమరావతిలో నిర్మాణాల కొనసాగింపునకు ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో చేపట్టిన నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, వాటి పునాదులకు డోకా లేదని తేల్చారు. ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హైకోర్టు, సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులను నిపుణులు పరిశీలించారు. వాటిపై అధ్యయనం చేసిన ఆ రెండు టీమ్స్.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాగా, భవనాల పునాదులకు సంబంధించి తుప్పు పట్టిన ఇనుమును తొలగించి కెమికల్ ట్రీట్ మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చని నిపుణుల బృందం నిర్ధారించింది.