Chandra Babu Davos Tour
Chandrababu Naidu Davos Tour: బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్ లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం దావోస్ కు వెళ్లనుంది. దావోస్ వేదికగా.. క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తోపాటు, ఐటీ, పలు కీలక రంగాల్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. దావోస్ పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అర్థరాత్రి దాటక 1.30 గంటల సమయంలో బృందంతో కలిసి జ్యూరిచ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం బృందంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ తో పాటు పరిశ్రమల శాఖ, ఇడిబి అధికారులు
ఉన్నారు.
Also Read: Amit Shah: జగన్‌మోహన్ రెడ్డి ప్యాలెస్‌లపై అమిత్ షా ఆరా.. చంద్రబాబు, లోకేశ్ ఏం చెప్పారంటే..?
జ్యూరిచ్ లో ఉన్న భారత రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. హిల్టన్ హోటల్ లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఉంటుంది. అదేవిధంగా హోటల్ హయత్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చ జరుగుతుంది. అనంతరం అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా నాలుగు గంటలు ప్రయాణించి సీఎం చంద్రబాబు బృందం దావోస్ కు చేరుకుంటుంది.
దావోస్ పర్యటన తొలిరోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్ లో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. అనంతరం అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. రెండోరోజు సీఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ ఉంటుంది. సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్ స్పన్, ఎల్జీ, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్ లతో రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. యుఎఈ ఎకానిమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ తోనూ భేటీ అవుతారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ ‘వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్’ అనే అంశంపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ది నెక్ట్స్ వేవ్ పై నీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చాగోష్టులు, బ్లూమ్ బర్గ్ కు ఇచ్చే ఇంటర్వ్యూలో ఏపీ విధానాలను చంద్రబాబు వివరిస్తారు. మూడోరోజు పలు బిజినెస్ టైకూన్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశం అవుతుంది. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గోనున్నారు. నాల్గోరోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి స్వదేశానికి తిరుగుపయనం అవుతారు.