Site icon 10TV Telugu

Cm Chandrababu: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం, కృష్ణా జలాలను కుప్పంకి తీసుకొచ్చాం- సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఈ జలాలతో కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. 738 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను ఇక్కడికి తీసుకురాగలిగామన్నారు. మల్యాల నుంచి 27 లిఫ్ట్‌ ఇరిగేషన్ల ద్వారా నీటిని తరలించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు. ఇది టీడీపీ ప్రభుత్వం సాధించిన ఘనతగా అభివర్ణించారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 110 చెరువులను నింపే అవకాశం ఇప్పుడు కలిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించగలిగితే తన జన్మ సార్థకమవుతుందన్నారు సీఎం చంద్రబాబు.

జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం తాము రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2 వేల కోట్లతో సరిపెట్టిందని విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో దిట్టలు అంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. గేట్లతో సెట్టింగ్‌లు చేసి నీళ్లు తెచ్చినట్లు నాటకాలడటం తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. మంచి పనులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ఒక విషవృక్షంగా మారిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

హంద్రీనీవా ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలకు కూడా నీళ్లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. రాబోయే ఏడాదిలో హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు తొలిసారిగా తరలిరావడంతో కుప్పం నియోజకవర్గలో పండగ వాతావరణం నెలకొంది.

Also Read: వైసీపీలో నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పుపై గోల.. ఎందుకంటే?

Exit mobile version