వైసీపీలో నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పుపై గోల.. ఎందుకంటే?

తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం. ఆయన చెప్పినట్లు పనిచేయాల్సిందేనని ముఖ్యనేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట.

వైసీపీలో నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పుపై గోల.. ఎందుకంటే?

YSRCP Leaders

Updated On : August 30, 2025 / 2:09 AM IST

YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత..వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా మంది నేతలు పార్టీని వీడి వెళ్లడంతో పలు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించింది. కొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చింది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇంచార్జ్‌ల మార్పు నేతల అసంతృప్తికి దారి తీస్తుందట. ఇంచార్జ్‌గా నియమించిన నియోజకవర్గంతో తనకు ఏమైనా సంబంధం ఉందా.? ఎందుకు ఆ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించారు.?

అక్కడికి వెళ్లి ఏం చేయగలం అంటూ పలువురు లీడర్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏ మాత్రం సంబంధం లేని చోట..కనీసం పది మంది కార్యకర్తలతో కూడా పరిచయాలు లేని నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లి ఏం చేయగలం.? అక్కడి పరిస్థితులు ఏంటో తమకు ఎలా తెలుస్తాయంటూ సన్నిహితుల దగ్గర మొరపెట్టుకుంటున్నారట.

ఏదో ఖాళీగా ఉంది కదా అని..ఆ నియోజకవర్గంలో ఏ నేత లేరని..తమను ఇంచార్జ్‌లు వేసి పార్టీ యాక్టివిటీ చేయాలంటే ఎలా కుదురుతుందని మధన పడుతున్నారట. సరే అధిష్టానం నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యత ఇచ్చింది కదా అని అక్కడికి వెళ్లి పనిచేసుకుందామనుకుంటే..తీరా ఎన్నికల టైమ్‌లో టికెట్ ఇస్తారో లేదోనన్న డైలమాలో ఉన్నారట పలువురు నేతలు.

Also Read: స్పీకర్ వర్సెస్ బీఆర్ఎస్.. పవర్‌ పాయింట్ ఫైట్..! కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ పెట్టేందుకు సర్కార్ రెడీ

గత ఎన్నికలకు ముందే అభ్యర్థులను మార్చి వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్న చర్చ ఉంది. నియోజకవర్గాలే కాదు..జిల్లా బార్డర్లు మార్చి..అక్కడి వారిని ఇక్కడ.. ఇక్కడి వారిని మరో చోటకు మార్చినా చివరకు ఫలితాలు ఎలా వచ్చాయో అర్థం కాలేదా అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేసి పార్టీలో ఉన్ననేతలను కూడా పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చిలకలూరిపేట నుంచి విడదల రజిని షిఫ్ట్ చేసి గుంటూరు వెస్ట్‌లో బరిలోకి దింపారు.

ఎన్నికల్లో ఓడాక మళ్లీ ఆమెకు చిలకలూరిపేట బాధ్యతలు ఇచ్చారు. దీంతో స్థానిక నేత రాజశేఖర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఇక సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబును ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇంచార్జ్‌గా వేశారు. అటు ఉత్తరాంధ్రలో గుడివాడ అమర్‌నాథ్‌కు..ఆయన ఒకటి కోరుకుంటే అధిష్టానం మరో నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా నియమించింది. దీంతో ఆయన ఆ నియోజకవర్గం వైపు కూడా చూడకుండా విశాఖ కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారు.

వేణుగోపాల్ రెడ్డి వ్యవ‌హారంపై మ‌రోసారి చ‌ర్చ 

ఇక వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవ‌హారం.. మ‌రోసారి చ‌ర్చకు దారి తీసింది. త‌న‌కు న‌ర‌స‌రావుపేట లేదా గుంటూరు పార్లమెంటు స్థానాల ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరాట మోదుగుల. కానీ ఆయనకు అప్పటికే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీ ముఖ్యనేత దగ్గర పంచాయితీ పెట్టారట మోదుగుల. విజ‌య‌వాడ‌లో తానేప్పుడు పనిచేయలేదని..ఆ ప్రాంతంతో తనకు సంబంధం కూడా లేదని..తన మొహం అక్కడి ప్రజలకు తెలియ‌దు..తనకు వాళ్లు తెలియ‌దు.

తానెలా అక్కడ రాజ‌కీయాలు చేయగలరు..పార్టీని ఎలా డెవ‌ల‌ప్ చేయగలను అంటూ..పార్టీ కీలక నేత దగ్గర తీవ్ర అసహనం వ్యక్తం చేశారట మోదుగుల. (YSRCP Leaders)

గుంటూరుకు చెందిన మోదుగుల‌కు గత ఎన్నికల్లోనే ఎంపీ టికెట్ ఇస్తామ‌ని ఇవ్వలేదు. దీంతో ఆయ‌న అలిగారు. పైగా.. పార్టీ కార్యక్రమాల‌కు దూరంలో ఉంటున్నారు. దీంతో ఆరు నెలల క్రితమే మోదుగులను విజ‌య‌వాడ పార్లమెంటు వైసీపీ ఇంచార్జ్‌గా నియ‌మించారు వైసీపీ అధినేత. కానీ మోదుగుల విజ‌య‌వాడ‌ పాలిటిక్స్‌పై ఆసక్తి చూపడం లేదట.

ఇటీవల ఈ వ్యవ‌హారంపై జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారట. దీంతో మోదుగుల పార్టీ ముఖ్యనేతను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చారట. త‌న‌కు విజ‌య‌వాడ‌తో ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అక్కడ రాజ‌కీయాలు చేయ‌లేన‌ని..టైం వేస్టు త‌ప్ప..ప్రయోజ‌నం ఉండ‌ద‌ని కూడా తేల్చి చెప్పారట. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ల నియామకం వైసీపీలో కాక రేపుతోంది.

తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం. ఆయన చెప్పినట్లు పనిచేయాల్సిందేనని ముఖ్యనేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట. దీంతో అవుననలేక..కాదనలేక..సైలెంట్‌గా ఉంటూ పార్టీ యాక్టివిటీలో పాల్గొనకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారట పలువురు నేతలు. ఏదైనా ఉంటే ఎన్నికల టైమ్‌లో తేల్చుకుందామంటూ వెయిట్‌ అండ్ సీ అంటున్నారట.