CM Jagan : ఇంటింటికీ వెళ్లి టీకాలు.. ఒమిక్రాన్ కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు

కోవిడ్‌ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా..

Cm Jagan

CM Jagan : కోవిడ్‌ వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధంగా చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం  చేయాలని, ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సిన్ చేయించుకోని వారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలన్నారు సీఎం జగన్. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు.

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా, ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వైరస్ వ్యాప్తి నివారణ, ముందస్తు చర్యలపై చర్చించిన సీఎం జగన్… అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని అధికారులు సీఎంకి తెలిపారు. వీరిలో ఎవరూ ఆస్పత్రిపాలు కాలేదన్నారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం భయాందోళన అవసరం లేదని సీఎం జగన్ అన్నారు. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

”డేటాను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా జరగాలి. కోవిడ్‌ నివారణలో ఇది మంచి యంత్రాంగం. టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతుల్లో ముందుకెళ్లాలి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలి. సచివాలయం స్థాయి నుంచి డేటా తెప్పించుకోవాలి. వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దాం” అని సీఎం జగన్ అన్నారు.

కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులపై బూస్టర్‌ డోసులో ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కాగా, 15 నుంచి 18 ఏళ్ల వారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమని ప్రాథమిక అంచనా వేశారు అధికారులు.

Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!

ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలని సీఎం జగన్ చెప్పారు. అలాగే విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్‌ చేయాలన్నారు. వారిపై క్రమం తప్పకుండా రెగులర్‌గా పరీక్షలు జరపాలన్నారు. పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌కు కూడా వెంటనే పరీక్షలు చేయాలన్నారు సీఎం జగన్.

13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్‌, 71.76 శాతం రెండో డోసు టీకాలు వేసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకి తెలిపారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ వేశామన్నారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూర్పుగోదావరి జిల్లాలో 97.43, కృష్ణాలో 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్ పూర్తయిందన్నారు.

మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో జనరల్‌ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని అధికారులతో చెప్పారు. ఆ లోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తి చేయాలన్నారు.