AP CM Jagan
CM Jagan- Chandrababu Arrest : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత చంద్రబాబుని జైల్లోకి తీసుకెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గాన పోలీసులు చంద్రబాబును తరలించారు. విజయవాడ నుంచి రాజమండ్రికి చేరుకోవడానికి ఐదు గంటలకుపైగానే సమయం పట్టింది.
కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకోసం జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని అధికారులు సిద్ధం చేశారు. జైలు అధికారులు చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు వద్ద దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వెంటే నారా లోకేశ్, తెదేపా నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. నారా లోకేశ్ ను మాత్రమే జైలు లోపలికి అనుమతించారు. పేపర్ వర్క్ ప్రక్రియ పూర్తికావడంతో జైలు నుంచి లోకేశ్ వెళ్లిపోయారు.
చంద్రబాబు జైలుకెళ్లడం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగించుకొని సోమవారం అర్థరాత్రి సమయంలో ఏపీకి రానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 2న రాత్రి 9.30గంటలకు సీఎం జగన్ దంపతులు తొమ్మిది రోజుల లండన్ పర్యటనకు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. తిరిగి 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబు రాజమండ్రి జైలుకెళ్లడంతో ఇప్పటికే వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు లండన్ పర్యటన నుంచి సోమవారం అర్థరాత్రి వరకు ఏపీకి చేరుకోనున్న జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు అరెస్టుపై ఏం మాట్లాడుతారనే చర్చ జరుగుతుంది.