సీఎం జగన్ వైజాగ్ వెళ్లడానికి ముహూర్తం సెట్ అయినట్లేనా!

కేంద్రం మూడు రాజధానుల నిర్ణయంపై అనుమతులు పంపేవరకూ వెయిట్ చేయాలనుకోవడం లేదు సీఎం జగన్. పరిపాలనా రాజధాని వైజాగ్‌కు మరి కొద్ది రోజుల్లో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 6వ తేదీ నుంచే సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పట్నం కేంద్రంగా పరిపాలన ఆరంభించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మార్చి 28వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఎన్నికల వాతావరణం, అమరావతిలో ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ మీద కసరత్తు చేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దిశగా మార్చి 30న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 4 రోజుల్లోనే సమావేశాలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
See Also | కరోనా కంట్రోల్ కోసం…మహారాష్ట్రలోని 5సిటీల్లో అన్నీ బంద్
వీటితో పాటుగా అమరావతి నుంచి విశాఖపట్నం తరలివెళ్లడానికి కొన్ని వ్యవహారాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మార్చి 29వ తేదీ నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఎన్నికల కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి మొదలై ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 6 నుంచి 17 వరకు 10 రోజుల పాటు ప్రభుత్వం సర్దుకుంటే ఆ తర్వాత ఉద్యోగులు పూర్తి స్థాయిలో అమరావతి నుంచి విశాఖపట్నం తరలి వెళ్లడానికి ఆస్కారం ఉంది.
పాలనా విభాగంలో ఉన్న అధికారులు ముందు తరలివస్తే.. మిగిలిన విభాగాల్లోని ఉద్యోగులను తర్వాత తీసుకురావచ్చనే ఆలోచనలో ప్రభుత్వం కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ సతీమణి భారతి విశాఖపట్నంలో పలుమార్లు పర్యటించి సీఎం ఉండేందుకు సరైన నివాసాన్ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.