వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

అన్న జగన్‌ను ఏకంగా 'జగన్‌రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.

CM Jagan Vs YS Sharmila

CM Jagan Vs YS Sharmila : శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే.. మన చుట్టూనే వైఫైలా ఉంటారు. కంటికి కనపడని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేసినట్లుగా ఉంటుంది… వీరితో యుద్ధం చేయడం!

జగన్‌కు ఏకంగా ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కొంతకాలంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఏ కుటుంబంలోనైనా ఏదో ఒకస్థాయిలో విభేదాలు ఉండటం సహజమేనయినప్పటికీ, ఈ విభేదాలు ఒక స్థాయిని దాటి.. రోడ్డెక్కితేనే పెద్ద సమస్యగా మారుతుంది. బయటకు కక్కలేని, మింగలేని పరిస్థితి ఎదురవుతోంది. కొన్నాళ్లవరకు కంటికి కన్పించని రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైఎస్‌ షర్మిల… ఇప్పుడు జగన్‌కు ఏకంగా కన్పించే ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారు. ఈ సమస్య ఒక్కసారిగా వచ్చింది కాదు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

ఏడాది క్రితం జగన్ కు పెద్ద సమస్య..
తన బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి న్యాయపోరాటం మొదలుపెట్టినప్పుడు.. దాదాపు ఓ ఏడాది క్రితం జగన్‌కు పెద్ద సమస్య ఏర్పడింది. ఆ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న కొందరు కీలక వ్యక్తులు కూడా జగన్ కుటుంబానికి సన్నిహిత బంధువులు కావడంతో జగన్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి వచ్చింది. పైగా వివేకా హత్యపై పలువురు వ్యక్తులు సీబీఐ ముందు ఇచ్చినట్టుగా చెబుతున్న సాక్ష్యాలు కూడా.. వైఎస్‌ జగన్‌కు చికాకు కలిగించాయి. ఈ వివాదంలోకి ఇతర కుటుంబ సభ్యులను లాగే విధంగా కొన్ని ఆరోపణలు రావడం.. సహజంగానే జగన్‌కు ఇబ్బంది కలిగించే అంశమే.

చెల్లెలు రూపంలో జగన్‌కు కొత్త సమస్య
ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు లేదా ప్రస్తుతానికి పాతబడినట్లు అన్పించగానే.. చెల్లెలు షర్మిల రూపంలో వైఎస్‌ జగన్‌కు కొత్త సమస్య వచ్చింది. షర్మిల స్వయాన తోడబుట్టిన చెల్లెలు కావడం, జగన్‌ జైల్లో ఉన్నప్పుడు జగన్‌కు మద్దతుగా షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడంతో.. జగన్‌ను, షర్మిలను విడివిడిగా చూడటం అంత తేలికకాదు. జగన్‌కు ఇష్టం లేకపోయినా.. ఓ రెండేళ్ల క్రితం షర్మిల తెలంగాణలో సొంతపార్టీ పెట్టినప్పుడు, ఆ నిర్ణయం ఆమెకు సంబంధించిన అంశం.. ఆమె ఇష్టం అంటూ కొంత దులిపేసుకొనే వెసులుబాటు లభించింది.

ఏకంగా అన్నపైనే విమర్శలు, బాబాయ్‌కే సవాల్..
తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. ఏకంగా అన్న జగన్‌పైనే విమర్శల బాణం ఎక్కుపెట్టడంతో, వైఎస్‌ కుటుంబ సభ్యుల్లో కొందరికి మింగుడుపడని పరిస్థితి ఉత్పన్నమయింది. అన్న జగన్‌ను ఏకంగా ‘జగన్‌రెడ్డి’ అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్లు, ఏపీలో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమంటూ తన బాబాయి, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డికి తాజాగా షర్మిల సవాల్‌ విసరడంతో.. ఇరుపక్షాల రాజకీయ పోరాటం మరింత తారస్థాయికి చేరే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

ఇటు జగన్‌.. అటు షర్మిల మధ్య నలిగిపోతున్న విజయమ్మ
చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శల దాడిపై, ఆమె అన్న జగన్‌ ఇప్పటివరకు వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు. ఎదురుదాడి బాధ్యతను మొదట ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి ఎత్తుకున్నారు. ఇతర వైసీపీ నాయకులు.. ఈ అంశంపై ఇప్పటివరకు బహిరంగంగా తీవ్రస్థాయి విమర్శలు చేయలేదు. మున్ముందు ఇది ఎలా ఉంటుందో వేచిచూడాలి. ఇటు జగన్‌.. అటు షర్మిల మధ్య ఒక రకంగా నలిగిపోతున్న వ్యక్తి ఎవరంటే వారి తల్లి వైఎస్‌ విజయమ్మ అని చెప్పాలి. రెండు కళ్లు లాంటి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మద్దతుగా నిలవాలన్నా.. వైఎస్‌ విజయమ్మకు చాలా కష్టం. ఎవరిని వారించాలన్నా కుదరని పరిస్థితి ఆమెది! ఇలాంటి పరిస్థితిని బహుశా ఏ తల్లిదండ్రులు కోరుకోరు.

జగన్ చేసిన ఆ వ్యాఖ్యలు షర్మిలను ఉద్దేశించి చేసినవేనా?
ఇన్ని సమస్యల మధ్య వైఎస్‌ జగన్‌ పరిస్థితి ఇప్పుడు ‘లవ్‌ అండ్‌ వార్‌.. ఆల్‌ ఇన్‌ ది ఫ్యామిలీ’ అన్న చందంగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను నిలువరించేందుకు నిస్సహాయులను చేసేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయని వైఎస్‌ జగన్‌ తన చెల్లెలు షర్మిల విషయంలో మున్ముందు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి! ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి, చంద్రబాబును జాకీపెట్టి లేపేందుకు కొందరు స్టార్‌ క్యాంపెయినర్లు ప్రయత్నిస్తున్నారని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాజాగా అనంతపురం సభలో చేసిన వ్యాఖ్యలు కాస్త కొసమెరుపుగానే భావించాలి. షర్మిలను ఉద్దేశించి చేసిన పరోక్ష ప్రస్తావనగానే దీన్ని భావించాలి.

 

ట్రెండింగ్ వార్తలు