బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

ys sharmila criticise cm jagan over ap special status

Updated On : January 23, 2024 / 2:11 PM IST

ys sharmila criticise cm jagan: కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బీజేపీని ప్రజలు తిరస్కరించినా.. సీఎం జగన్ మాత్రం ఆ పార్టీకి ఊడిగం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించకపోయినా రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి.. బీజేపీకి బానిసలు అయిపోయారని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశం అయిపోయిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా జగన్ అన్న మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్సార్ పాదయాత్ర ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రస్థాన జ్ఞాపిక స్థూపాన్ని షర్మిల మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ ప్రజల కష్టాలు చూశారు. ఆ పాదయాత్ర నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పేదల పక్షాన నిలబడటానికి వచ్చాను. నా ప్రస్థానం వైఎస్ పాదయాత్ర ముగింపు దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాను. రాజన్న బిడ్డను ఆశీర్వదించండి. కాంగ్రెస్ కు రాజశేఖర్ రెడ్డి ఎంత చేశారో ఆయనకూ పార్టీ అంత చేసింది. గాంధీ ఫ్యామిలీ ఎవ్వరికీ అన్యాయం చేయదు. మా కుటుంబానికి సోనియా గాంధీ కుటుంబం ఎనలేని ప్రేమ పంచింది.

Also Read: చంద్రబాబుకు ఇతర పార్టీల్లోనూ బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. సీఎం జగన్ విసుర్లు

ఏపీలో పరిస్థితులు చాలా బాధాకరం. బీజేపీని ఏపీలో ప్రజలు తృణీకరించారు. కానీ సీఎం జగన్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారు. బీజేపీకి సీఎం, ఎంపీలు బానిసలుగా మారారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా జగన్ అన్న మాట్లాడరు. ఇదే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెడలు వంచుతాను అన్నారు. మరి ప్రత్యేక హోదా ఏమయ్యిందో జగన్ సమాధానం చెప్పాలి.రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేర్చాలనే వచ్చాన”ని షర్మిల అన్నారు.