YSR Free Crop Insurance : ఏపీ రైతులకు శుభవార్త- నేడే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం

ఏరువాకతో సాగుకు సిధ్దమవుతున్న రైతన్నలకు అండగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మరోసారి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు.

YSR Free Crop Insurance : ఏపీ రైతులకు శుభవార్త- నేడే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం

ysr crop Insurance

Updated On : June 14, 2022 / 10:01 AM IST

YSR Free Crop Insurance :  ఏరువాకతో సాగుకు సిధ్దమవుతున్న రైతన్నలకు అండగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మరోసారి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. 2021 ఖరీఫ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.  ఈ పధకం ద్వారా  ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4.04లక్షల మంది రైతులకు గాను  రూ.925 కోట్లకు పైగా బీమా అందుతుంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా చూస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారం సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక సీజన్‌ పంటల బీమా మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటిస్తారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.50 గంటలకు చెన్నే కొత్తపల్లి చేరుకుంటారు. 10.50 నుంచి 11.05 గంటల మధ్య స్థానిక నేతలను కలుస్తారు. 11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

New Project (2)

రైతులపై పైసా భారం పడకుండా ఆర్బీకేల ద్వారానే ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పంటల బీమా వర్తింపజేస్తున్నారు. పంట వేసినప్పుడే ఈ క్రాప్‌లో నమోదు చేయించి రసీదు ఇస్తున్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా అందుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నారు. వైపరీత్యాల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతన్నలు ప్రభుత్వ అధికారులు, దళారుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పాయి.

New Project

టీడీపీ ఐదేళ్ల పాలనలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి ఇప్పటికే 28.67 లక్షల మందికి రూ.3,707.02 కోట్ల బీమా పరిహారం అందించింది. తాజాగా ఖరీఫ్‌–2021లో నష్టపోయిన రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం అందిస్తోంది. దీంతో కలిపితే 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,684.84 కోట్లు లబ్ధి చేకూర్చింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రైతులకు అన్ని పథకాలూ కలిపి రూ. 1,27,823 కోట్లు సాయంగా నేరుగా అందించింది.

Also Read : Monsoons : తెలుగు రాష్ట్రాలను పలకరించిన నైరుతి రుతుపవనాలు