Carona Deaths
funerals delay, due to fear in AP : బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ పై ఇద్దరు, ముగ్గురికి వైద్యం చేస్తున్నారు. నేలపై పడుకోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు.
బెడ్లు ఖాళీ లేక అంబులెన్స్‌ల్లో నగరం అంతా తిరుగుతున్నారు రోగులు. కరోనా కేసులు పెరగడంతో అంబులెన్సులు దొరకని పరిస్థితి. బెజవాడలో ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోయేసరికి ఉల్లిపాయలు ఆటోలోనే పేషంట్ ను ఆస్పత్రికి తరలించారు. బెడ్లు ఖాళీ లేవంటూ ఆసుపత్రి ఆవరణ బయటే ఆటో నిలిపివేశారు. ఇంతలోనే పేషంట్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన భర్త ప్రాణాలు కోల్పోయారంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆక్సిజన్ పెట్టండి మహోప్రభు అన్న ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. బెడ్లు ఖాళీ లేవంటూ బలవంతంగా వైద్య సిబ్బంది బయటకు పంపారని.. ఇంతలోనే కన్నుమూశాడని ఆమె కన్నీరుమున్నీరవుతోంది.
విజయవాడ ఆస్పత్రుల్లో ఎక్కడ చూసిన రోగుల రోదనలే. ఆస్పత్రి యాజమాన్యాలు మానవత్వాన్ని మరిచిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం పట్టించుకోవాలంటూ రోగుల బంధువులు వేడుకుంటున్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో వైద్యం చేయలేక ఆస్పత్రి సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
కరోనా రోగులతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మందులు, ఇంజెక్షన్ల కొరత ఏర్పడుతుంటే.. పెరుగుతున్న మృతులతో శ్మశానాల్లో దహన సంస్కారాలు కూడా కష్టంగా మారుతోంది. ఇటు సహజ మరణాలు, అటు కోవిడ్ మృతులతో శ్మశానాలకు తాకిడి పెరుగుతోంది. గతంలో రోజుకు పది మృతదేహాలు వచ్చే శ్మశానాలకు ఇప్పుడు 70 నుంచి 100 వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఘాట్‌లు ఖాళీగా ఉన్నా.. దహనం చేసే కాటికాపరులు లేక మృతుల కుటుంబ సభ్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వస్తున్న శవాలతో పోలిస్తే కాటికాపరులు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో మృతదేహాన్ని తీసుకొచ్చి గంటల తరబడి వేచిచూసే పరిస్థితి ఉంది.
కోవిడ్ మృతులను దహనం చేయాలంటే కాటికాపరులు కూడా భయపడుతున్నారు. వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న ఆందోళనతో చాలా మంది విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో మృతుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ధరించినా ప్రమాదకరమైన వైరస్ ఎక్కడ కాటేస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు. కోవిడ్ మృతదేహాలతో ఎంతసేపు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఘాట్‌లు ఖాళీగా ఉన్నా.. దహనం చేసే కాటికాపరులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న మృతుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొనైనా కాటికాపరులను పెంచాలని కోరుతున్నారు.
విజయవాడ శ్మశనాల్లో మృతదేహాలను దహనం చేసేందుకు కాటికాపరులు లేక బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతుంటే.. విశాఖపట్నంలో కట్టెల కొరత వేధిస్తోంది. జ్ఞానాపురం శ్మశానవాటికలో గతంలో రోజుకు 10 నుంచి 15 మృతదేహాలను దహనం చేసేవారు. కోవిడ్ మృతులతో క్రమంగా ఈ సంఖ్య 40 నుంచి 50కి పెరిగింది. ప్రస్తుతం రోజుకు వంద మృతదేహాలు వస్తున్నాయి. దీంతో శవాలను కాల్చేందుకు కూడా కట్టెలు దొరకని పరిస్థితి ఉంది.
కరోనా వైరస్ బాధితులు వైద్యం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విశాఖ వస్తున్నారు. వ్యాధి ముదిరి మరణిస్తే విశాఖలోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. దీంతో కట్టెల కొరత ఏర్పడుతున్నట్టు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. కట్టెలులేక దహన సంస్కారాలు ఆలస్యమవుతున్నాయన్న ఉద్దేశంతో కొందరు సొంతంగా కట్టెలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. శ్మశానాలకు కట్టెలు సరఫరా చేసే వ్యాపారులు కూడా రేట్లు పెంచారు. మృతదేహాన్ని బట్టి కట్టెలు అవసరం ఉంటాయి.