×
Ad

AP Govt : ‘మొంథా’ తుపాన్‌.. ఏపీలో ఎన్ని ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందో తెలుసా.. వాళ్లకు రూ.5లక్షలు

AP Govt : ఏపీని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

Montha Cyclone

AP Govt : ఏపీని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు ప్రాంతాల్లో గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.

తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు తుపాను వల్ల రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఏపీలో మొంథా తుపాను కారణంగా కురిసిన వర్షాల వల్ల భారీగానే పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో వరి పంట కోత దశలో ఉంది. ఈ క్రమంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో పంట నేలవాలింది.

Also Read: Rain Alert : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. దిశ మార్చుకోకుంటే డేంజరే.. మళ్లీ కుండపోత వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు..

ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో 304 మండలాల్లో 1825 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 87వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 59వేల హెక్టార్లలో వరి.. మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 78వేల796 మంది రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో 42 పశువులు మృత్యువాత పడ్డాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి పరిశీలించాక నష్టం లెక్కలు మరింత పెరగవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.

కోనసీమ, కాకినాడ, ప్రకాశం, తూర్పుగోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, వైఎస్సార్‌ కడప, ఏలూరు జిల్లాల్లో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి, కంది, మిరప, కూరగాయలు, పసుపు, అరటి, బొప్పాయి, ఉల్లి, పూలతోటలు దెబ్బతిన్నాయి.