Rain Alert : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. దిశ మార్చుకోకుంటే డేంజరే.. మళ్లీ కుండపోత వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు..
Rain Alert మొంథా తుపాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడిగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని.
Rain Alert
Rain Alert : ఏపీని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు ప్రాంతాల్లో గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ప్రస్తుతం మొంథా తుపాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడిగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని.. అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపునకు దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 31వ తేదీకి ఆవర్తనంగా మారుతుంది. నవంబర్ 1వ తేదీకి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో, థాయిలాండ్ పక్కన ఏర్పడుతుంది. ఇది క్రమంగా.. పశ్చిమం వైపు కదులుతుంది. అది దిశమార్చుకోకుండా అలానే ముందుకు వస్తే.. ఏపీలోని గుంటూరును చేరగలదని తెలుస్తోంది. అయితే, దాని దిశ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇది అల్పపీడనంగా ఉంటుందా.. వాయుగుండంగా మారి.. ఆ తరువాత తుపానుగా మారుతుందా అనేది ఇంకా తెలియదని, ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: AP New Districts: 6 కాదు రెండే? ఏపీలో కొత్త జిల్లాల ఎపిసోడ్‌లో మారిన ప్రభుత్వ వైఖరి?
ఏపీని వణికించిన మొంథా తుపాను ప్రభావం ప్రస్తుతం తగ్గింది. మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తీరం దాటిన తుపాను.. బుధవారం మధ్యాహ్నం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తరువాత దిశ మార్చుకొని ఉత్తర -ఆగ్నేయ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్ గఢ్, తెలంగాణ వైపు కదిలింది. గురువారం సాయంత్రంకు వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, ఇవాళ (గురువారం) ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
విశాఖపట్టణం జిల్లాలో ఇవాళ స్కూళ్లకు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఇవాళ ప్రైమరీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గడంతో కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నడుస్తాయని డీఈవో ప్రకటించారు. వాస్తవానికి ముందుజాగ్రత్తలో భాగంగా జిల్లాలో ఈనెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే, తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఇవాళ్టి నుంచి మళ్లీ పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
