AP New Districts: 6 కాదు రెండే? ఏపీలో కొత్త జిల్లాల ఎపిసోడ్‌లో మారిన ప్రభుత్వ వైఖరి?

దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తుందట. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలన్నది పెద్ద సమస్య.

AP New Districts: 6 కాదు రెండే? ఏపీలో కొత్త జిల్లాల ఎపిసోడ్‌లో మారిన ప్రభుత్వ వైఖరి?

Updated On : October 29, 2025 / 10:06 PM IST

AP New Districts: ఏపీలో జిల్లాల ఎపిసోడ్‌ ఎంతుకూ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడున్న 26 జిల్లాలతో పాటు మరో ఆరు కొత్త జిల్లాలు రాబోతున్నాయన్న ప్రచారం జరిగింది. కట్‌ చేస్తే కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు రెండే అని కొత్త టాక్ బయలుదేరింది. ఎడతెగని పంచాయితీకి సీఎం చంద్రబాబు ఎండ్‌ కార్డ్ వేయబోతున్నారా? జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాల వివాదానికి చెక్ పెట్టబోతున్నారా? కొత్తగా ఏర్పడే రెండు జిల్లాలు ఏవి? అమరావతిని జిల్లా కేంద్రం చేయట్లేదా?

ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలు ఉండగా..ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ 26 జిల్లాలుగా విభజించింది అప్పటి వైసీపీ సర్కార్. ఇక ఏపీలో 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. అయితే లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాల విభజన చేయడంతో చాలా సమస్యలు వచ్చాయంటోంది కూటమి ప్రభుత్వం. జిల్లా కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో మండలాలు, డివిజన్లు ఉండటంతో..సొంత జిల్లాకు దూరంగా..పక్కా జిల్లాకు అతి దగ్గరలో ఉండేలా అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేశారని..ఎన్నికల ముందే ప్రచారం చేశాయి కూటమి పార్టీలు.

అలాగే ఎన్నికల సమయంలో జిల్లాల ఏర్పాటుపై కూడా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై స్టడీ చేసేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటి వరకు 12 వేల వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలతో ఆ శాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

కొత్త జిల్లాగా మార్కాపురం.. ఆల్ మోస్ట్ ఫైనల్..!

ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆల్ మోస్ట్ ఫైనల్ అని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లెను కూడా జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చిందట. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తుందట. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలన్నది పెద్ద సమస్య. వాటిని ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా.. 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్‌ వ్యవస్థీకరించాలని ప్రతిపాదనలు వచ్చాయట.

అయితే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను విభజించి జిల్లాల సంఖ్యను 32కు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి మారిందని కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ..ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు మార్చడానికే పరిమితమవ్వాలని నిర్ణయించినట్లు టాక్. గతంలో పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో పరిపాలన సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు.

అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గానికి దగ్గరలో రాజమండ్రి ఉంది. కానీ, రంపచోడవరాన్ని పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లాలో కలపడంతో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న చింతూరు, పోలవరం ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వెళ్లడం కన్నా, రాష్ట్ర రాజధానికి చేరుకోవడమే ఈజీగా ఉంటోంది. దీంతో ఈ ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా..

ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందట. పుంగనూరు లేదా పీలేరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయడంతో పాటు అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతమున్న 10 రెవెన్యూ డివిజన్లలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేట పట్టణానికి మార్చాలని వచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదనలను వచ్చినట్లు చెబుతున్నారు. సేమ్‌టైమ్‌ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును తిరిగి నెల్లూరులో విలీనం చేస్తారని చెబుతున్నారు.

ఏదైనా డిసెంబర్‌ 31లోపు జిల్లాల అంశాన్ని కొలిక్కి తేబోతున్నారట. త్వరలో జనగణన చేపట్టనుండటంతో..2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగానే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లోగానే రెండు కొత్త జిల్లాలకు, నాలుగు రెవెన్యూ డివిజన్లకు, సరిహద్దుల మార్పునకు క్యాబినెట్‌లో డిస్కస్ చేసి ఆమోదం తెలుపుతారని అంటున్నారు.

Also Read: గూగుల్ డేటా సెంటర్‌‌పై డైలాగ్ వార్‌లో కొత్త టర్న్.. రంగంలోకి టీడీపీ.. నెక్ట్స్ ఏం జరగనుంది?